అభివృద్ధే లక్ష్యం

Development is the goal– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డిలతో కలిసి నక్కగూడెంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి శంకుస్థాపన
నవతెలంగాణ-చింతలపాలెం
ప్రజల అభివృద్ధే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెం గ్రామంలో రూ.37.7కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం, రూ.400 కోట్లతో ఇన్నోవేరా లైఫ్‌సైన్స్‌ ప్రయివేట్‌ పరిశ్రమకు భారీ నీటి పారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశామన్నారు. ఈనెల 27న 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు అమలు చేస్తామన్నారు. అంతేగాకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమపథకా లు అందేలా చూస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఏ ఒక్క అభివృద్ధి పనీ సరిగ్గా జరగలేదన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాగ్యానాయక్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని రూ.37.7 కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృష్ణాజలాలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. దొండపాడు గ్రామంలో నిర్మిస్తున్న ఇన్నోవేరా లైఫ్‌సైన్స్‌ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు.
మార్గమధ్యలో మంత్రులు కిష్టాపురం రైతు గోవిందరెడ్డి పొలంలో మిర్చి ఏరుతున్న కూలీల వద్దకు వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న పథకాలను వారికి వివరించారు. పీఆర్‌ పరిశ్రమ నుంచి కిష్టాపురం గ్రామపంచాయతీ వరకు రూ.20 కోట్లతో డబుల్‌ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ అప్పిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొండారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

Spread the love