ముస్లిం వివాహాలు విడాకుల చట్టం రద్దు

Abolition of Muslim Marriages Divorce Act– అసోం బీజేపీ ప్రభుత్వ ఆమోదం
– యూసీసీ అమలులో ముందడుగు : సీఎం
– బాల్య వివాహాలను అడ్డుకుంటుందంటూ సమర్ధన
– ఇది ముస్లింలే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమన్న విమర్శకులు
దిస్‌పూర్‌ : 1935వ సంవత్సరపు అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం రద్దుకు బీజేపీ నేతృత్వంలోని అసోం ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులో ఇది ముందడుగు అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అసోం మంత్రి జయంత మల్లా బారువా చెప్పారు. ఇది వలస పాలకుల కాలం నాటి చట్టమని ఆయన అన్నారు.
‘ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల వయసు రాకపోయినప్పటికీ ఈ చట్టం వివాహ నమోదును అనుమతిస్తోంది. ఇప్పుడు దానిని రద్దు చేశాం. అసోంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంలో ఈ చర్య దోహదపడుతుంది’ అని హిమంత బిశ్వ శర్మ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. బాల్య వివాహాలను అడ్డుకోవడమే ఈ చట్టం రద్దు యొక్క ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ రాష్ట్రంలోని ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శకులు అంటున్నారు. వివాహాలు, విడాకులను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని, అది ఐచ్ఛికమని ఈ చట్టం చెబుతోందని, అందుకే దానిని రద్దు చేశామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
కాగా చట్టం రద్దుతో అసోంలోని 94 మంది ముస్లిం వివాహ రిజిస్ట్రార్ల నుండి ప్రభుత్వానికి చెందిన జిల్లా కమిషనర్లు, జిల్లా రిజిస్ట్రార్లు వివాహ, విడాకుల నమోదు రికార్డులను స్వాధీనం చేసుకుంటారు. ముస్లిం వివాహ రిజిస్టార్లకు ఏకమొత్తంలో రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తారు. 1935వ సంవత్సరపు చట్టం రద్దు నేపథ్యంలో ప్రత్యేక వివాహాల చట్టం కింద ముస్లిం వివాహాలను నమోదు చేస్తామని మంత్రి బారువా చెప్పారు. యూసీసీ బిల్లును ఉత్తరాఖండ్‌ శాసనసభ ఇటీవలే ఆమోదించింది. అసోంలో కూడా యూసీసీ బిల్లును తీసుకొస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి బిశ్వ శర్మ దీనిని ఓ ఎన్నికల ప్రచారాంశంగా మార్చేశారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధిస్తామని కూడా ఆయన ప్రచారం చేశారు. ఇది ముస్లిం పర్సనల్‌ లాపై దాడి చేయడమేనని పరిశీలకులు వ్యాఖ్యానించారు. యూసీసీ బిల్లు నుండి ఆదివాసీలను మినహాయిస్తామని కూడా బిశ్వ శర్మ చెప్పారు. ఉత్తరాఖండ్‌ యూసీసీ బిల్లు కూడా ఆ రాష్ట్రంలోని గిరిజనులను దాని పరిధి నుండి తొలగించింది. గుజరాత్‌లోని బీజేపీ సర్కారు సైతం యూసీసీ బిల్లును రూపొందించింది. త్వరలోనే దానిని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోతోంది. భారతీయ ముస్లింల ప్రాథమిక హక్కులను యూసీసీ ఉల్లంఘిస్తోందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలువురు నేతలు ఆరోపించారు.

Spread the love