మణిపూర్ లో… మూడు నెలల్లో ముఫ్పై మంది అదృశ్యం

  • 44 మృతదేహాలకు రేపు సామూహిక అంత్యక్రియలు

    మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
    మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

నవతెలంగాణ ఇంఫాల్‌: మణిపుర్‌లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నప్పటి నుంచి ఈ మూడు నెలల కాలంలో దాదాపు 30 మంది అదృశ్యమైనట్టు తెలుస్తోంది. అదృశ్యమైనవారిలో టీనేజర్లతోపాటు నడివయస్సు కూడా వరకు ఉన్నారని అక్కడి మీడియా కథనాలు తెలుపున్నాయి.  పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త అయిన సమరేంద్ర సింగ్‌(47) కల్లోలం మొదలైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యాడు. ఇంతవరకూ అతడి జాడ దొరకలేదని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ తోపాటు అతడి మిత్రుడి జాడ కూడా తెలియడం లేదని తెలుస్తోంది. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వారు వెళ్లారని గుర్తించారు. తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.
జులై 6న ఆంక్షలు సడలించడంతో హిజామ్ లువాంగ్బీ (17) నీట్ కోచింగ్‌ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత  తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్టు సీసీటీవీ దృశ్యాలను బట్టి పోలీసులు వెల్లడించారు. వారిద్దరి ఫోన్లు రెండు వేర్వేరు జిల్లాల్లో స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపారు. హిజామ్ సెల్‌ఫోన్ ఇప్పుడు కొత్త నంబర్‌తో వినియోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. “ఆ ప్రాంతం ప్రధాన రహదారి నుండి కేవలం10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అయినా పోలీసులు వెతకడానికి అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయరు” అని హేజామ్ తండ్రి ఫిజామ్ ఇబుంగోబి  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూడు నెలల వ్యవధిలో అదృశ్యమైన వారి వెనక ఒక్కో కారణం ఉంది. ఫిర్యాదులు అందిన వెంటనే తాము చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కానీ కనిపించకుండా పోయిన వారి జాడ మాత్రం దొరకడం లేదు. అదృశ్యమైన వారి సంఖ్య 30 మందిగా ఉన్నప్పటికీ.. ఇది మరింత పెరగొచ్చని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక  ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో వివిధ కారణాలతో 6వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  కొండల్లో, పౌర సమాజం తప్పిపోయిన కేసులను నమోదు చేసింది. మృతదేహాలను ఇంకా వెనక్కి పంపని కేసులను కూడా నమోదు చేసింది. ఆగస్ట్ 3న సామూహిక అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. “మా ప్రజలు తప్పిపోయిన 44 మంది మృతదేహాలు ఇప్పుడు ఇంఫాల్ ఆసుపత్రులలోని మార్చురీలలో ఉన్నాయని నివేదికలు ఉన్నాయి. ఆ మృతదేహాలను ఖననం చేయడానికి పంపాలని మేము అధికారులను అభ్యర్థించాము” అని ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) ప్రతినిధి గింజా వల్జాంగ్ తెలిపారు.

Spread the love