కడ్తాల్‌లో కొనసాగుతున్న పారిశుధ్య పనులు పరిశీలన
పల్లె ప్రగతి పనులు పరిశీలించి సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి అభినందన
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామాలలో పారిశుధ్య పనులు పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ పి.రవీందర్ ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంటు వ్యాధులు ప్రబలకుండా కడ్తాల్ గ్రామంలో గత రెండు రోజులుగా చేపడుతున్న ముందస్తు పారిశుధ్య పనులను గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డిప్యూటీ కమిషనర్ పి.రవీందర్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదని, తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి కంపోస్టు జీవన ఎరువుల తయారీతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్‌తో పాటు వైకుంఠ ధామాన్ని సందర్శించి వాటి రూపకల్పనలో ప్రదర్శించిన పనితీరును అభినందించారు. కడ్తాల్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం ప్రత్యేకతను చాటుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, అశోక్, కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.