Sunday, April 26, 2026
E-PAPER
Homeజిల్లాలువారం గడిచినా ఒక్క గింజా కొనలే

వారం గడిచినా ఒక్క గింజా కొనలే

- Advertisement -

కిస్తీల పద్ధతిలో రైతుబంధు
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
అంబేద్కర్‌ రాసిన ఆర్టికల్‌ ప్రకారమే తెలంగాణ : కేటీఆర్‌
నవతెలంగాణ – తంగళ్లపల్లి

రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన రైతుబంధును కిస్తీల పద్ధతిలో అందిస్తున్నారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో శనివారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్‌ పరిశీలించారు. రామన్నపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ రాసిన ఆర్టికల్‌ త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందన్నారు. నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొంటే మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 1000 టన్నుల వడ్లు కూడా కొనలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ రైతులకు అండగా నిలిచి, పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వడ్ల కొనుగోళ్ల కోసం వెంటనే కాంటాలను ఏర్పాటు చేసి, రైస్‌ మిల్లులను కేటాయించాలని, రూ.500 బోనస్‌తో కలిపి కనీస మద్దతు ధరను రూ.2350గా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -