Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంజంపింగ్‌ ఎంపీలకు సెగ

జంపింగ్‌ ఎంపీలకు సెగ

- Advertisement -

– పార్టీ ఫిరాయింపులపై జోక్యం చేసుకోండి
– రాష్ట్రపతికి పంజాబ్‌ సీఎం మాన్‌ లేఖ
– పార్టీ మారాక రాఘవ్‌ చద్దాకు తగ్గిన ఫాలోవర్లు
– హర్భజన్‌ సింగ్‌ ఇంటి గోడలపై ద్రోహి అంటూ రాతలు
– భగ్గుమంటున్న ఆప్‌ శ్రేణులు

న్యూఢిలీ : ఆమ్‌ఆద్మీ పార్టీలో కలకలం రేపిన రాజ్యసభ ఎంపీల జంపింగ్‌ అంశం వేడెక్కింది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ సైతం ఊహించని విధంగా దెబ్బతీసిన ఎంపీల నిర్ణయం ఢిల్లీ నుంచి పంజాబ్‌ వరకు భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఆప్‌ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ శనివారం రాష్ట్రపతి జోక్యం కోరారు. ఎంపీ రాఘవ్‌ చద్దా సహా ఏడుగురు ఆప్‌ ఎంపీలతో కూడిన రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమైన సంగతి తెలిసిందే. కమలం పార్టీలో విలీనమైనట్టు త్వరలో నోటిఫై చేయనున్న తరుణంలో..గోడ దూకిన ఆ ఎంపీలను వెనక్కి రప్పించేందుకు రాజ్యంగ నిబంధనలు వినియోగించేందుకు ఆప్‌ సిద్ధమవుతోంది. బీజేపీలోకి చేరిన ఏడుగురిలో ఆరుగురు(రాఘవ్‌ చద్దా, అశోక్‌ మిట్టల్‌, సందీప్‌ పాఠక్‌, హర్భజన్‌ సింగ్‌, రాజిందర్‌ గుప్తా, విక్రమ్‌ జిత్‌ సింగ్‌ సాహ్ని) రాజ్యసభలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజిందర్‌ గుప్తా మినహా మిగిలిన వారిని 2022లో పంజాబ్‌ ఎమ్మెల్యేలు ఎన్నుకోగా, గుప్తా గతేడాది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ నుంచి స్వాతి మలివాల్‌ మాత్రమే ఎన్నికయ్యారు. దీంతో తనకు, తన ఎమ్మెల్యేలకు కొంత సమయం కావాలని పంజాబ్‌ సీఎం రాష్ట్రపతిని కోరారు.
పది మంది ఎంపీల్లో ఏడుగురు విలీనం కావాలని నిర్ణయించుకున్నందున, 3డింట రెండు వంతుల ఎంపీలు బీజేపీలో ఒక నిట్‌గా విలీనం కావడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌ ద్రోహి
పంజాబ్‌ రాజకీయాల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఆప్‌ని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలపై వీధుల్లోనూ సాధారణ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాజీ క్రికెటర్‌, ఎంపీ హర్భజన్‌ సింగ్‌ నివాసం బయట నల్ల సిరాతో ”పంజాబ్‌ ద్రోహి” అని రాసి ఉండగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నల్ల హ్యాండ్‌ బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. ఎంపీ ఇంటివద్ద భద్రతావలయంగా ఉన్న పోలీసులు సమీపంలోనే ఉన్నప్పటికీ..నిరసనకారులు గోడపై రాతలు రాయటం విశేషం. ఈ నాయకులు ఆప్‌నకే కాకుండా పంజాబ్‌ ప్రజల నమ్మకానికి కూడా ద్రోహం చేశారని నిరసనకారులు అంటున్నారు. అదే విధంగా వారిని ”ద్రోహులు” అని పిలుస్తూ నినాదాలను వారి ఇండ్లపైనా, లవ్లీ ప్రొఫెషనల్‌ నివర్సిటీ వద్ద కూడా రాశారు. నిరసనగా తమ పిల్లలను ఎల్‌పీయూలో చేర్పించబోమని కొందరు ప్రకటించారు.

రాఘవ్‌ చద్దాకు షాక్‌ .. తగ్గిన ఫాలోవర్లు
ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాకు యువతలో మంచి క్రేజ్‌ ఉంది. రాజ్యసభలో ఆయన వేసే ప్రశ్నలు, మాట్లాడే పద్ధతిని నెటిజన్లు తరచూ అభినందిస్తుంటారు. అయితే ఆయన ఆప్‌ను వీడి బీజేపీలోకి చేరడంపై అభిమానుల్లోనూ కోపం కట్టలు తెంచుకుంది. పార్టీ మారుతున్నట్టు చద్దా ప్రకటించిన 24 గంటల్లోనే సోషల్‌ మీడియాలో ఆయన ఫాలోయింగ్‌ తగ్గిపోయింది. ఈ ఎంపీకి ఇన్‌స్టాలో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది. ఆయన నిర్ణయాన్ని జెన్‌జీ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చేలా బీజేపీ కుట్రలు
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే బీజేపీ అనుసరిస్తున్న విధానమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ, మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌ల పార్టీలు, తమిళనాడులోనూ రాజకీయ కుట్రలకు బీజేపీ దిగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకోవటానికి కమలం పార్టీ కుయుక్తులు పన్నుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సరికాదు : అన్నాహజారే
ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, అశోక్‌ మిట్టల్‌తో సహా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి చేరడంపై సామాజిక కార్యకర్త, ఆ పార్టీ ప్రధాన స్రూతధారి, సైద్ధాంతిక మార్గదర్శకుడు అన్నాహజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు మారడం సరైన పని కాదని అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పార్టీని వీడి మరొక పార్టీలో చేరడం సరైంది కాదు. మన స్వార్థం కోసం రాజకీయ పార్టీలను మార్చడం సరైంది కాదు. ఈ విషయం మన రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. మన రాజ్యాంగం సర్వోన్నతమైనది. మన దేశం రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది” అని ఆయన అన్నారు. కాగా, 2011లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమం ద్వారానే అవినీతిని అంతమొందించడానికి ఆప్‌ పార్టీ ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -