మోడీ పాలనలో క్షీణిస్తున్న విద్యా స్వేచ్ఛ
రాజీనామాలు, సస్పెన్షన్లు, అరెస్టులు
భారత్‌లో అధ్యాపకులపై పెరుగుతున్న ఒత్తిళ్లు
అధికార బీజేపీ రాజకీయ జోక్యం, నియంత్రణ
దెబ్బతింటున్న విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి
విద్యావేత్తలు, మేధావుల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పాలనలో విద్యా రంగం అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విద్యా స్వేచ్ఛ ఆందోళనకరంగా మారింది. గత పదేండ్లలో అధ్యాపకులకు బోధనా స్వేచ్ఛ, పరిశోధనా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండటం లేదు. యూని వర్సిటీల స్వయం ప్రతిపత్తి నీటి మీద రాతలా మారి పోయింది. భారత్‌లో అకాడమిక్ స్వేచ్ఛ దశాబ్దంలో తీవ్రంగా పడిపోయిందని తాజా నివేదికలు సూచిస్తు న్నాయి. ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి నందుకు సస్పెన్షన్లు, రాజీనామాలు, అరెస్టులు ఎదుర్కొం టున్న ఘటనలు పెరిగిపోతుండటంతో.. విద్యా వ్యవస్థలో భయమైన వాతావరణం నెలకొంది. దేశంలో ఈ పరిస్థితిపై విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోయిన అకాడమిక్ స్వేచ్ఛ
స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ సంస్థ విడుదల చేసిన ‘అకాడెమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్’ నివేదిక సమాచారం ప్రకారం…భారత్ అకాడమిక్ స్వేచ్ఛలో 2012లో 0.65 నుంచి 2025లో 0.14కి పడిపోయింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలలో భారత్ ర్యాంకు 156గా ఉంటే.. అది ఈ సారి కూడా అట్టడుగుకే పరిమితమైంది. స్కాలర్స్ ఎట్ రిస్క్ (ఎస్‌ఏఆర్) విడుదల చేసిన ‘ఫ్రీ టు థింక్ 2025’ నివేదిక కూడా భారత్‌లో విద్యా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా స్వేచ్ఛలో ఆందోళనకర పరిస్థితులు కలిగి ఉన్న 16 దేశాలు, ప్రాంతాలలో భారత్‌ను చేర్చింది.
బీజేపీ తీరుపై ఆందోళన
ఈ నివేదిక భారత్‌లో అధికార బీజేపీ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఆ పార్టీ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ యూనివర్సిటీల స్వయంప్రతిపత్తికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. విద్యాసంస్థలను నియంత్రిస్తూ, యూనివర్సిటీలపై హిందూ జాతీయవాద ఎజెండాను రుద్దుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2026 వరకు కనీసం 62 మంది ఉపాధ్యాయులు తమ అభిప్రాయాల కారణంగా వివిధ శిక్షలకు గురయ్యారు. వీరిలో పది మంది తొలగింపునకు గురయ్యారు. 16 మందిని సస్పెండ్ చేశారు. 12 మందిని రాజీనామా చేయించారు. 21 కేసుల్లో అరెస్టులు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వాన్ని, హిందూత్వ రాజకీయాలను విమర్శించినవారే కావడం గమనార్హం.
సీసీఎస్ నిబంధనల ప్రభావం
2018లో కేంద్ర ప్రభుత్వ సర్వీసు నియమాలు (సీసీఎస్) విశ్వవిద్యాలయాలకు వర్తింపజేయ డం ఒక కీలక మలుపుగా నివేదికల సమాచారం వివరిస్తోంది. ఈ నియమాల ప్రకారం… అధ్యాపకులు ప్రభుత్వాన్ని విమర్శించరాదు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన రాదు. మీడియాతో మాట్లాడే విషయంలో పరిమితులు ఉంటా యి. దీంతో ఉపాధ్యాయుల మీద ఆంక్షలు అధికమయ్యాయి. ఇవి వారి స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.
సోషల్ మీడియా, తరగతి గదులపై నిఘా
ఉపాధ్యాయుల సోషల్ మీడియా పోస్టులు, క్లాస్ లెక్చర్లు కూడా నిఘా పరిధిలోకి వచ్చాయి. ఫేస్‌బుక్ పోస్ట్‌ల వల్ల అరెస్ట్‌లు, పరీక్ష ప్రశ్నల కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ఆన్‌లైన్ వ్యాఖ్యలపై సస్పెన్సన్ వంటివి కొన్ని ఉదాహరణలుగా ఉన్నాయి. ఇది ఉపాధ్యాయుల్లో భయాన్ని పెంచి, స్వీయ నియంత్రణకు దారి తీస్తోంది.
రచనలు, పరిశోధనలపై నియంత్రణ
పేపర్లు రాసినా, వ్యాసాలు ప్రచురించినా ముందస్తు అనుమతి అవసరమనే వాతావరణ ఏర్పడింది. కొంత మంది ప్రొఫెసర్లు అకాడమిక్ స్వేచ్ఛ లేకపోవడంతో రాజీనామా చేశారు. ఇక ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనడం కూడా ప్రమాదకరంగా మారింది. నిరసనల్లో పాల్గొన్నందుకు ట్రాన్స్‌ఫర్లు, సంఘ కార్యకలాపాలపై చర్యలు, ‘ఉపా’ వంటి కఠిన చట్టాల కింద అరెస్టులు వంటివి చోటు చేసుకున్నాయి.
రాజకీయ ప్రభావం
దేశంలో విద్యావ్యవస్థపై రాజకీయ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా అధికార బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. దీంతో విశ్వవిద్యాల యాల స్వయంప్రతిపత్తి తగ్గుతోంది. ఇది విద్యా వాతావరణాన్ని మార్చేస్తోంది. దేశంలోని భిన్నాభిప్రా యాలను అణచివేస్తోందనే విమర్శ మేధావులు, విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతోంది. మోడీ పాలనలో ఇన్ని కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. కొంత మంది అధ్యాపకుల నుంచి ప్రతిఘటన కొనసాగుతోంది. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ”కేంద్ర యూనివర్సిటీ టీచర్లు అంటే గవర్నమెంట్ సర్వెంట్లు కారు. ప్రభు త్వాన్ని డిఫెండ్ చేయడం నా బాధ్యత కాదు, నిజాన్ని మాట్లాడటం నా బాధ్యత” అని జేఎన్‌యూ ప్రొఫెసర్ సురాజిత్ మజుందార్ అన్నారు. నిబంధనలు అర్థం లేనివనీ, అధ్యాపకులకు స్వేచ్ఛ ఉండాలనీ, ప్రజా చర్చలకు స్థానం కల్పించాలని తెలిపారు.



