Thursday, April 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు150 మీటర్ల ఎత్తులో తుమ్మిడి హట్టి

150 మీటర్ల ఎత్తులో తుమ్మిడి హట్టి

- Advertisement -

మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిదే
సమన్వయం బాధ్యత ఉత్తమ్‌కు అప్పగింత
ఆదిలాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలకు
సాగు, తాగు నీరు : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి నీటి పారుదల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందనీ, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందనీ, మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ నిపుణులు సీఎంకు తెలిపారు. బ్యారేజ్‌ నిర్మాణంతో ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీరందుతుందన్నారు. అలాగే తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే వీలుంటుందని సీఎం చెప్పారు. ప్రాజెక్ట్‌ ప్రాధాన్యత దృష్ట్యా మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదనీ, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెంటనే లేఖ రాయాలని సూచించారు. గురువారం కేంద్ర మంత్రి సమయం తీసుకుని నేరుగా కలిసి చర్చించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి అప్పగించారు, తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ అవసరం దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కిషన్‌రెడ్డికి తెలంగాణ రైతుల పక్షాన విజ్ఞప్తి చేయాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్‌ పనులను వర్షాకాలంలోపు వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు.

నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తు నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుంటుందని ఈ సందర్భంగా అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందనీ, కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని అన్నారు. 71.5 కిలోమీటర్ల కెనాల్‌ పనులు జరిగాయని అధికారులు తెలిపారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందనీ, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఈఎన్సీ శ్రీధర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -