వేసవిలో పెరుగుతున్న కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు
డీహైడ్రేషన్‌ను తేలికగా తీసుకుంటే ప్రమాదం : వైద్యుల హెచ్చరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
వేసవికాలం అంటే చాలా మందికి గుర్తొ చ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల మౌనంగా దెబ్బతినే అవయవాల్లో కిడ్నీలు ముందుంటాయని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. ప్రతి ఏడాదీ ఉష్ణో గ్రతలు పెరిగేకొద్దీ కిడ్నీ రాళ్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, మూత్రం తగ్గిపోవడం, నడుము-పక్క భాగంలో తీవ్రనొప్పి వంటి సమస్యలతో ఆస్పత్రు లకు వచ్చే వారిసంఖ్య గణనీయంగా పెరుగు తోందని యూరాలజిస్టులు చెబుతున్నారు.
100లో 12 మందికి కిడ్నీలో రాళ్ల సమస్య
వేసవిలో చెమట రూపంలో శరీరం అధికంగా నీటిని కోల్పోతుంది. అదే సమ యంలో తగినంత నీరు తాగకపోతే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో మూత్రం సాంద్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు స్ఫటికాలుగా మారి క్రమంగా కిడ్నీ రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. మన దేశంలో ప్రతి 100 మందిలో సుమారు 12మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీ రాళ్ల సమస్య వచ్చే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ సమస్య మ రింత అధికంగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ ప్రమాదం
కిడ్నీలో రాళ్లతో పాటు వేసవిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ల సమస్య కూడా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రం పరిమాణం తగ్గి బ్యాక్టీరియా శరీరం బయటకు వెళ్లకుండా నిల్వ ఉండటంతో ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలు, డయాబెటిస్ ఉన్న వారు, ప్రోస్టేట్ సమస్యలున్న పురుషులు, గతంలో యూరిన్ ఇన్‌ఫెక్షన్లు వచ్చినవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం. వైద్యుల సూచన ప్రకారం.. దాహం వేయడం అంటే శరీరం అప్పటికే డీహైడ్రేషన్‌లోకి వెళ్లిందనే సంకేతం. అలాగే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లు తాగితే సరిపోతుందని అనుకోవడం కూడా తప్పు అని వైద్యులు చెబుతున్నారు.
వైద్యులు హెచ్చరిస్తున్న లక్షణాలు ఇలా..
నడుము లేదా పక్క భాగంలో ఆకస్మికం గా వచ్చే తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట లేదా రక్తం కనిపించడం, మూత్రం తగ్గిపో వడం, తరచూ మూత్రం రావడం, జ్వరం, వాంతులు, అలసట, కడుపు దిగువ భాగంలో ఒత్తిడి లేదా నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత క్లిష్టమై అత్యవసర చికిత్స అవసరమయ్యే స్థితి రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో వచ్చే కిడ్నీ రాళ్లు, యూరిన్ ఇన్‌ఫెక్షన్లలో చాలా వరకు పూర్తిగా నివారించగలిగేవే. చిన్న అలవాట్లు-సరైన హైడ్రేషన్, సమయానికి చికిత్స-కిడ్నీలను పెద్ద ప్రమాదాల నుంచి కాపాడగలవని వైద్యులు చెబుతున్నారు.
వేసవిలో కిడ్నీలను కాపాడుకోవాలంటే..
– దాహం వేయకముందే నీళ్లు తాగాలి
– బయటకు వెళ్తే వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలి
– ఎండలో పని చేసే వారు మరింత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి
– పుచ్చకాయ, దోసకాయ, ముసంబి, కొబ్బరినీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి
– అధిక ఉప్పు, ప్యాకెట్ ఫుడ్స్, సాఫ్ట్‌డ్రింక్స్ తగ్గించాలి
– మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు.
యూరాలజీ కేసుల్లో పెరుగుదల : డాక్టర్ నవీన్ కుమార్
సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు అండ్ ఆండ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్, మలక్‌పేట
వేసవి ప్రారంభమైన తర్వాత యూరాలజీ కేసుల పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కిడ్నీ రాళ్లు, యూరిన్ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో మంట, తీవ్రమైన ఫ్లాంక్ పెయిన్‌తో రోగులు ఎక్కువగా వస్తుంటారు. పదే పదే డీహైడ్రేషన్‌కు గురవ్వడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్య క్రమంగా పెరుగుతుంది. హైడ్రేషన్‌కు అసలు ప్రత్యామ్నాయం నీళ్లే. కేఫిన్, అధిక చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ మరింత పెరగొచ్చు. పైగా అవి కొన్ని సందర్భాల్లో స్టోన్ ఫార్మేషన్‌కు దారితీసే మెటబాలిక్ మార్పులను కూడా ప్రోత్సహిస్తాయి.
నీళ్లుమాత్రమే కారణంకాదు : డాక్టర్ వేణు మన్నే, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్
కిడ్నీ రాళ్లకు కేవలం నీళ్లు తక్కువ తాగడం మాత్రమే కారణం కాదు. వేసవిలో అధిక ఉప్పు ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, చల్లని పానీయాల పేరుతో అధికంగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి దోహదపడుతాయి.



