మూడు నెలల్లో పెండింగ్ సమస్యలు క్లియర్
సాదాబైనామాలకు 45 రోజుల్లోనే పరిష్కారం : ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ – ఖమ్మంరూరల్
ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో బుధవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాధారణ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు గరిష్టంగా వ¶డు నెలల గడువు విధిస్తున్నామని, ఈలోపు ప్రతి దరఖాస్తుకూ స్పష్టమైన పరిష్కారం చూపడమే లక్ష్యమని చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సాదాబైనామా సమస్యలను 45 రోజుల్లోనే పరిష్కరిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తూ పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రెండో విడత ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని 12 గ్రామాల్లో రెండున్నరేండ్లలో రూ.386 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. రైతుల సంక్షేమంలో తమ ప్రభుత్వం రాజీపడదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలోనే శుభవార్త అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల చీఫ్ ఇంజినీర్లు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



