నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యా,వైద్యాభివృద్ధిలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు.శనివారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన,ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశాన్ని రాష్ట్ర గీతం ఆలపించి,సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.ఉచిత బస్సు ప్రయాణం,గృహజ్యోతి,రైతు భరోసా,రైతు భీమా,సన్నబియ్యం,ఇందిరమ్మ ఇండ్లు,500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఇటీవల తిరుమలగిరి మార్కెట్ నుండి ధాన్యాన్ని తరలించి వెంపటి, గొట్టిపర్తి ఐకెపి కేంద్రాలలో విక్రయించడానికి సహకరించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమావేశానికి హాజరుకాని పంచాయతీ కార్యదర్శులపై తగిన చర్యలు తీసుకోవాలని,ప్రత్యేక పాలన సమయంలో కార్యదర్శులు అవినీతికి పాల్పడి అధిక బిల్లులు చేయించారని అన్నారు.సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని,నియోజకవర్గంలోని సరైన వసతులు లేని పాఠశాలల వివరాలు తనకు అందజేయాలని డీఈవోకు సూచించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలల నుండి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,డీఎస్పీ ప్రసన్నకుమార్,డిఇఓ అశోక్ కుమార్,డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్,ఏడిఏ రమేష్ బాబు, పంచాయతీరాజ్ డిఈ లింగా నాయక్,సిడిపిఓ శ్రీజ,తాసిల్దార్ దయానందం,ఎంపీడీవో శేషు కుమార్,ఎంఈఓ లు బోయిని లింగయ్య,శాంతయ్య,వాసం ప్రభాకర్, నియోజకవర్గ పరిధిలోని సీఐలు,ఎస్సైలు, సర్పంచులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



