Tuesday, May 5, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మిసైల్స్ ఉమెన్ సంకల్పం నుంచి శిఖరాగ్రం వరకు

మిసైల్స్ ఉమెన్ సంకల్పం నుంచి శిఖరాగ్రం వరకు

- Advertisement -

ప్రతి రోజు సాయంత్రం ఇంటి ముందున్న ఆరుబయట కూర్చుని ఆకాశాన్ని చూస్తూ తారలతో, మేఘాలతో మమేకమైపోయేది ఆరవ తరగతి చదువుతున్న ఒక చిన్నారి. ఒక రోజు సాయంత్రం ఆమె రోజులాగే కూర్చుని ఆకాశాన్ని ఆస్వాదిస్తోంది. ఆకాశం నీలిరంగులో మెరిసిపోతూ, గాలి మెల్లగా వీస్తూ చుట్టూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో అకస్మాత్తుగా వారి ఇంటి దగ్గరలో ఉన్న ఈక్వెటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ వైపు నుంచి ఒక్కసారిగా గర్జన వినిపించింది. ఆశ్చర్యంతో ఆమె ఆకాశం వైపు చూసిన క్షణాల్లోనే, అగ్నిగోళంలా మెరుస్తూ ఒక రాకెట్‌ నింగిలోకి దూసుకుపోతోంది. మహా గర్జనతో అద్భుతంగా జ్వలిస్తూ గగనాన్ని చీల్చుకుంటూ, దూసుకెళ్తున్న ఆ దృశ్యం ఆమె కళ్లను అమితంగా ఆకర్షించింది. ఆమె భారతదేశంలో ‘మిస్సైల్‌ ఉమెన్‌’గా ప్రసిద్ధి చెందిన గొప్ప శాస్త్రవేత్త టెస్సి థామస్‌గా నిలిచింది.

ఆకాశంలో దూసుకెళుతున్న రాకెట్‌ చూసి ‘వావ్‌ ఇది ఎంత అద్భుతంగా ఉంది’ అని ఆమె మనసులో అనుకుంది. ఆ క్షణమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆకాశంలోకి దూసుకుపోతున్న ఆ రాకెట్‌ను తిలకిస్తూ, ‘నేనూ ఏదోఒక రోజు ఇలాం టి రాకెట్‌ను సృష్టించే శాస్త్రవేత్తగా ఎదగాలి’ అని అంతరంగంలో ఏర్పడిన అచంచల సంకల్పాన్ని ప్రతిజ్ఞగా మలుచుకుంది. ఆ రోజు నుంచే శాస్త్రవేత్తగా ఎదగాలంటే అనుసరించవలసిన మార్గమేమిటి అనే మనోమథనంతో ఆమె మునిగిపోయింది. తన ఆశయ సిద్ధికి విద్య ఒక్కటే ఏకైక మార్గమని ఆమె స్పష్టంగా గ్రహించింది. అందుకు విజ్ఞానశాస్త్రం, గణితశాస్త్రాల పట్ల విశేష ఆసక్తిని ఏర్పరచుకుంది.

అగ్నిజ్వాలలా రగిలేది
గగనతలాన్ని తిలకించే ప్రతి సందర్భంలోనూ, తన కలల కిరణం మళ్లీ మళ్లీ మనసులో మెరవగా ‘ఇంకా కృషి చేయాలి, ఇంకా కఠోరంగా శ్రమించాలి’ అనే దృఢనిశ్చయం ఆమె అంతరంగంలో అగ్నిజ్వాలలా రగిలేది. కలలు కనడం సహజం కానీ, వాటిని సాకారం చేసే కృషే మహత్తరమని గ్రహించిన టెస్సి ఆలోచనను ఆచరణగా, ఆశయాన్ని సాధనగా మలచుకునే దిశగా ధైర్యంగా ముందడుగు వేసింది. రాకెట్ల పట్ల ఉన్న ఆ అభిరుచి ఆమెను కళాశాలలో ఇంజనీరింగ్‌ అభ్యసించేందుకు ప్రేరేపించింది. కాలక్రమేణా తన కృషి, పట్టుదలతో ముందుకు సాగుతూ, ఎదురైన ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మలచుకుంది.

తల్లి ప్రేరణతో…
కేరళలోని ఒక చిన్న పట్టణం నుంచీ భారతదేశ క్షిపణి సాంకేతిక రంగంలో కీర్తిశిఖరాలను అధిరోహించడం వరకు ఆమె సాధించినది అసాధారణ యాత్ర. సంకల్పాన్ని సాకారంగా, శ్రమను శిఖరంగా మలుచుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె జీవనగాథ కలలు కనేవారికి దిశానిర్దేశక దీప్తిలా వెలుగొందుతుంది. ఆ కలలను సాకారం చేసుకునే సాధనలో ఆమె ప్రదర్శించిన ధైర్యం, దృఢసంకల్పం, కఠోర కృషి, తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది. బాల్యం నుంచే ఆమె జీవనయాత్ర సవాళ్లతో నిండిపోయింది. పదమూడేళ్ల వయసులోనే తండ్రికి స్ట్రోక్‌ రావడంతో కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి ఆరోగ్య పరిస్థితి కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీసింది. ఇంతవరకు ఇంటి బయట పనిచేయని తల్లి, కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించింది. ఆ సంక్షోభ సమయంలో తల్లి ప్రదర్శించిన ధైర్యం, దృఢసంకల్పం, నిరంతర శ్రమ టెస్సీ మనసులో చెరగని ముద్ర వేసాయి. ఆ విపత్కర సమయంలో కనిపించిన ఆ తల్లి త్యాగం, పట్టుదల ఆమె భవిష్యత్తుకు ప్రేరణగా మారి విజయ మార్గంలో నడిపించే శక్తిగా నిలిచాయి.

ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా…
1988లో ఆమె డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)లో శాస్త్రవేత్తగా చేరి, జడత్వ నావిగేషన్‌ (×అవత్‌ీఱaశ్రీ చీaఙఱస్త్రa్‌ఱశీఅ) విభాగంలో తన పరిశోధనా ప్రయాణాన్ని ప్రారంభించింది. తన ప్రారంభ దశలోనే ఆమె ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం మార్గదర్శకత్వంలో అగ్ని క్షిపణి కార్యక్రమంపై పనిచేశారు. తరువాత ఆమె అగ్ని-×V ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, 2011లో జరిగిన పరీక్షను విజయవంతంగా నడిపించారు. అంతేకాకుండా, ఆమె అగ్ని-V ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అగ్ని-V భారతదేశంలోనే మొదటి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (×జదీవీ), ఇది 5000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరగలదు. 2012, 2018లో జరిగిన అగ్ని-V పరీక్షలు భారత రక్షణ రంగంలో ముఖ్యమైన మైలురాళ్లుగా నిలిచాయి. ఈ క్షిపణి సుమారు 3000 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండే రీ ఎంట్రీ ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అనేక అద్భుత ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తూ, పురుషాధిక్యంతో నిండిన శాస్త్ర రంగంలో ఆమె తన ప్రతిభా పటిమతో పటిష్ఠ స్థానాన్ని సంపాదించింది. అడ్డంకులను అధిగమిస్తూ, అపనిందలను పంటి బిగువున భరిస్తూ, అవరోధాలను అవకాశాలుగా మలుచుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని అజేయ ఆయుధంగా మార్చుకుంది.

విశేష సేవలకు అనేక పురస్కారాలు
పురుషుల ప్రాభావం ప్రబలంగా ఉన్న వాతావరణంలోనూ తన సంకల్పశక్తి, సమర్థత, నిరంతర సాధనతో ఆమె స్త్రీశక్తి సత్తాను సుస్పష్టంగా తన మహత్తర కృషి ద్వారా చాటిచెప్పింది. సాధారణ స్త్రీగా కాదు స్ఫూర్తి స్వరూపిణిగా, సమర్థతకు సమీకరణంగా, విజయానికి ప్రతీకగా ఆమె ఎదిగింది. ఆమె అందుకున్న అవార్డులు టెస్సి కృషి, ప్రతిభ, పట్టుదలకు ప్రతీకలుగా నిలుస్తాయి. రక్షణ పరిశోధన రంగంలో ఆమె చేసిన విశేష సేవలకు అనేక పురస్కారాలు లభించాయి. 2001లో డీఆర్‌డీఓ అగ్ని అవార్డును అందుకున్నారు. 2008లో డీఆర్‌డీఓ ‘సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నారు. అగ్ని-×V, అగ్ని-V క్షిపణి ప్రాజెక్టుల్లో ఆమె చేసిన కృషికి గాను 2011, 2012లో పెర్ఫార్మెన్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు అందుకున్నారు. 2012లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభకు ప్రతిష్ఠాత్మకమైన లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డును పొందారు. అదేవిధంగా 2009లో సుమన్‌ శర్మ అవార్డు, 2012లో మేడమ్‌ మేరీ క్యూరీ మహిళా విజ్ఞాన పురస్కారం వంటి గౌరవాలు ఆమెకు దక్కాయి. 2018లో డాక్టర్‌ థామస్‌ కాంగన్‌ లీడర్‌షిప్‌ అవార్డును అందుకుని తన ప్రతిభను మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టుకున్నారు. భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన తొలి మహిళగా టెస్సీ థామస్‌ చరిత్ర సృష్టించారు. ఆమె నాయకత్వం భారత రక్షణ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా అగ్ని క్షిపణి ప్రాజెక్టులో ఆమె పోషించిన పాత్ర దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె కథ సాధారణ విజయగాథ కాదు సాహసానికి సంకేతం, సాధనకు సాక్ష్యం, స్త్రీశక్తికి శిఖరాగ్ర ప్రతీక. యువతకు ముఖ్యంగా ప్రతి యువతికి, ఆమె జీవితం నూతన నిశ్చయానికి నాంది.

  • కోట దామోదర్‌, 9391480475

కష్టాలను ఎదుర్కొంటూనే…
టెస్సి ఈక్వెటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ సమీపంలో పెరిగిన కారణంగా, అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరే రాకెట్లను చూసి ఆమెకు విజ్ఞానం, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ చిన్ననాటి అనుభవాలే ఆమె భవిష్యత్తుకు బలమైన పునాది అయ్యాయి. కష్టాలను ఎదుర్కొంటూనే టెస్సీ తన చదువులో ప్రతిభ కనబరిచింది. త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల నుండి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బి.టెక్‌ పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో నిరుత్సాహపడకుండా, తన చదువుకు నిధులు సమకూర్చుకోవడానికి విద్యా రుణం తీసుకుంది. తర్వాత పూణేలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్మమెంట్‌ టెక్నాలజీ (ప్రస్తుతం డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ) నుండి గైడెడ్‌ మిస్సైల్స్‌లో ఎం.టెక్‌ పూర్తి చేసింది. అలాగే హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ నుండి మిస్సైల్‌ గైడెన్స్‌లో పీహెచ్‌.డి పొందింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -