ప్రజలలో ఎల్‌డీఎఫ్‌కు మద్దతు.. 37 శాతం ఓట్లే దీనికి నిదర్శనం ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుంది
మత, విభజన, విద్వేష రాజకీయాలతో బెంగాల్‌లో బీజేపీ గెలుపు
తమిళనాడులో ప్రజల తీర్పును దెబ్బతీసే ప్రయత్నాలు
ప్రజలు కఠిన పొదుపు చర్యలు పాటించాలని ప్రధానిని పిలుపునివ్వడం సరికాదు
ఇది ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన అవసరం లేదన్న కేంద్రం వాదనలను బట్టబయలు చేసింది
లేబర్ కోడ్స్ అమలులో బీజేపీది కార్మిక వ్యతిరేక విధానం.. కార్మికుల పక్షాన నిలుస్తాం
మహిళా బిల్లును పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టొద్దు
సర్‌తో ఎన్నికల విశ్వసనీయతపై దెబ్బ
సీపీఐ(ఎం) పార్టీ పొలిట్‌బ్యూరో ప్రకటన
ఈనెల 22-24 తేదీలలో ఢిల్లీలో కేంద్ర కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : దేశంలో మతతత్వ శక్తుల ఎదుగుదలను అడ్డుకుంటామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. కేరళలలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్)కు ప్రజలలో మద్దతు ఉన్నదని, ఇటీవల ఎన్నికల్లో వచ్చని గణనీయమైన ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనమని వివరించింది. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుందని పేర్కొంది. ఈనెల 10, 11 తేదీలలో న్యూఢిల్లీలో సమావేశమైన సీపీఐ(ఎం) పార్టీ పొలిట్‌బ్యూరో పలు అంశాలపై చర్చించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పదేండ్ల సుదీర్ఘ పాలన తర్వాత కేరళంలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డీఎఫ్) ఓటమిని చూసింది. తొలిసారిగా బీజేపీ మూడు సీట్లను గెలుచుకోగలిగింది. ఇది చాలా ప్రమాదకరం. కాంగ్రెస్.. సీపీఐ(ఎం)కు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు, వార్తలను ప్రచారం చేసింది. కేరళంలో బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసింది. ఎల్‌డీఎఫ్ ఓడినప్పటికీ.. 37.6 శాతం ఓట్లను పొందింది. ఇది ప్రజలలో కూటమికి ఉన్న మద్దతును తెలియజేస్తుంది. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ఎల్‌డీఎఫ్ క్యాడర్‌కు, మద్దతుదారులకు, అలాగే తమకు ఓటు వేసిన కేరళం ప్రజలకు పొలిట్‌బ్యూరో ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రంలో మతతత్వ శక్తుల ఎదుగుదలను అడ్డుకోవడంలో పార్టీ ముందుంటుంది. సమాజంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుంది. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తుంది. ప్రజల జీవనోపాధి, ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరిగితే ఎదిరిస్తుంది.
పశ్చిమ బెంగాల్‌లో మతతత్వ, విభజన, తీవ్ర ద్వేషపూరిత ప్రచారం, భారీగా ఖర్చు చేయడం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో పాటు కేంద్ర ఏజెన్సీల ఘోరమైన దుర్వినియోగం ద్వారా బీజేపీ గెలిచింది. అవినీతి, నిరంకుశ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత కూడా బీజేపీకి లాభాన్ని చేకూర్చింది. అసోంలో బీజేపీ మెరుగైన మెజారిటీతో తిరిగి ఎన్నికవడంతో పాటు, హిందుత్వ-మతతత్వ, మితవాద శక్తుల ఆధిపత్య పెరుగుదలను మనం గమనిస్తున్నాం. తమిళనాడులో ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పును బీజేపీ, దాని మిత్రపక్షాలు గవర్నర్ కార్యాలయం ద్వారా దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ సూత్రాలను కాపాడుకోవడం కోసం సీపీఐ(ఎం).. సీపీఐ, వీసీకేలతో కలిసి టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు తెలిపింది.
కఠిన పొదుపు పాటించాలన్న ప్రధాని పిలుపునకు ఖండన
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా కఠిన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునివ్వడం చాలా విడ్డూరం. అమెరికా-ఇజ్రాయిల్ కూటమితో పూర్తిగా చేతులు కలపాలన్న నిర్ణయం వల్ల, ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు కఠిన పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రజలను కోరుతోంది. ప్రభుత్వానికి కొంత ముందు చూపు ఉండి, తన చమురు ఉత్పత్తి శ్రేణిని విస్తరించి ఉంటే.. మనం ప్రస్తుత దుస్థితిలో ఉండేవాళ్లం కాదు.
వ్యవసాయ సీజన్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో రైతులకు ప్రాధాన్యతా క్రమంలో ఎరువులు అందుబాటులోకి తీసుకురాకపోతే, మన ఆహార ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ఎరువులను సేకరించి, వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రభుత్వ కర్తవ్యం.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వాదనలను ప్రధాని ప్రకటన బట్టబయలు చేసింది. ఆయన ప్రకటనే ఆర్థిక వ్యవస్థలో అంతా సవ్యంగా లేదని రుజువు చేస్తోందని స్పష్టం చేసింది.
కార్మిక చట్టాల నోటిఫికేషన్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన కేవలం నాలుగు రోజులకే, వారు (కేంద్రం) ఇప్పుడు కార్మిక చట్టాలను అమలులోకి తెచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వపు మోసపూరిత కార్యవిధానాన్ని బట్టబయలు చేస్తుంది. కనీస వేతనాలు, మెరుగైన జీవన పరిస్థితులు కోరుతూ, ఎక్కువ పని గంటలను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న భారీ నిరసనలను విస్మరించి, నిబంధనలను నోటిఫై చేయడానికి ముందుకు సాగడం బీజేపీ కార్మిక వ్యతిరేక స్వభావాన్ని బయటపెడుతుంది.
నోటిఫై చేసిన కేంద్ర నిబంధనల ప్రకారం కార్మిక చట్టాలను అమలు చేయకుండా, భారత రాజ్యాంగం ప్రకారం తమ శాసన అధికారాలను వినియోగించుకుని, కార్మిక చట్టాలకు సవరణలు తీసుకువచ్చి, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్మికులకు పొలిట్‌బ్యూరో తన మద్దతును పునరుద్ఘాటించింది.
కేంద్రానిది దాసోహపూరిత విదేశాంగ విధానం
ఇరాన్‌పై అమెరికా దురాక్రమణను భారత ప్రభుత్వం నిస్సందేహంగా ఖండించడంలో విఫలమైంది. క్యూబాకు సంఘీభావం తెలుపుతూ భారత ప్రభుత్వం ఒక దృఢమైన వైఖరిని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వపు దాసోహపూరిత విదేశాంగ విధాన వైఖరికి మరో నిదర్శనమని పొలిట్‌బ్యూరో విమర్శించింది. కాగా ఈనెల 22-24 తేదీలలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఢిల్లీలో సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించనుంది.
కార్మికుల సమస్యలు పరిష్కరించి, కేసులు ఉపసంహరించుకోవాలి
గత రెండు నెలలుగా అత్యంత తీవ్రమైన, ఆకస్మిక కార్మిక వర్గ నిరసనలు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) చుట్టూ కేంద్రీకృతమైనప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయి. యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించి, పోలీసు బలగాలను ప్రయోగించింది. వందలాది మంది కార్మికులను అరెస్టు చేసింది. వారిలో చాలామంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కార్మికులపై నమోదు చేసిన అన్ని తప్పుడు కేసులనూ ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలనీ, వారి కనీస వేతనాలను పెంచాలనీ, ఈ సమస్యను శాంతిభద్రతల సమస్యగా కాకుండా కార్మిక వివాదంగా పరిగణించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
క్యూబాకు యూఎస్ బెదిరింపులు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు
క్యూబాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా మరోసారి ప్రకటించి, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. క్యూబా సంస్థలతో కార్యకలాపాలు నిర్వహించే, లావాదేవీలు జరిపే ఏ విదేశీ సంస్థపైనైనా తప్పనిసరి ఆంక్షలను విధిస్తూ యూఎస్ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు సార్వభౌమ మూడో పక్ష దేశాలపై ప్రత్యక్ష బలప్రయోగ సాధనంగా ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగిస్తుంది. పొలిట్‌బ్యూరో క్యూబాకు తన ప్రగాఢ సంఘీభావాన్ని తెలియజేసింది. అమెరికా బెదిరింపులను ఖండించడంలో మన దేశ ప్రజలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్థిక దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.
నియోజకవర్గాల పునర్విభజన
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టి మద్దతు కూడగట్టాలని చూసింది. ప్రతిపక్షాలు సమిష్టిగా బీజేపీ కుట్రలను ఓడించాయి. ప్రతిపక్షం మొత్తాన్ని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ సఫలం కాలేకపోయింది. బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణ రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించడం కూడా దీని ఉద్దేశం. తన ఎజెండాను అమలు చేయడానికి బీజేపీ ఇప్పుడు ప్రభుత్వ సంస్థలను సమర్థవంతంగా వాడుకుంటోందని ఇది మరోసారి స్పష్టం చేస్తుంది. వచ్చే విడత ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్న తమ డిమాండ్‌ను సీపీఐ(ఎం) పునరుద్ఘాటించింది. ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపెట్టాల్సిన అవసరం లేదదని స్పష్టం చేసింది.
‘సర్ ’ ప్రభావం
సర్ ప్రక్రియ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై భారీ ప్రభావాన్ని చూపింది. ఓటర్ల జాబితా నుంచి ఈసీ దాదాపు 27 లక్షల మంది పేర్లను తొలగించింది. ఈ మొత్తం ప్రక్రియ మన ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ప్రభుత్వ సంస్థలలోని దాదాపు అన్ని స్థాయిలలోకి చొచ్చుకుపోయిన తమ
క్యాడర్‌ను ఉపయోగించి, ఆరెస్సెస్-బీజేపీ తమ లక్ష్యాలను సాధించడానికి
ప్రయత్నిస్తోంది అని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.
మతతత్వ శక్తులను అడ్డుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



