Thursday, May 14, 2026
E-PAPER
Homeక్రైమ్నేపాలీ గ్యాంగ్‌ మరో భారీ దోపిడీ

నేపాలీ గ్యాంగ్‌ మరో భారీ దోపిడీ

- Advertisement -

వృద్ధ దంపతులను బెదిరించి మత్తు మందు ఇచ్చి దొంగతనం
60తులాల బంగారు ఆభరణాలు,
15 కేజీల వెండి, 3వేల డాలర్లు, విలువైన వస్తువుల అపహరణ
నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు
జవహర్‌నగర్‌లో ఘటన
నవతెలంగాణ-జవహర్‌ నగర్‌
నిన్న జూబ్లీహిల్స్‌.. నేడు జవహర్‌నగర్‌.. నగరంలో నేపాలీ గ్యాంగ్‌లు విరుచుకు పడుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినరు రంజన్‌ రే భార్యను నేపాలీ గ్యాంగ్‌ హత్య చేయగా ఆ కేసు దర్యాప్తులో ఉండగానే తాజాగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. పనిమను షులమంటూ చేరి.. కన్నబిడ్డల్లా చూసుకుంటున్న వృద్ధ దంపతులనే మత్తులో ముంచి కోటి రూపాయల సొత్తుతో మాయమయ్యారు దుండగులు. పుట్టినరోజు వేడుక అని నమ్మించి.. భోజనం పెడుతున్న యజమానుల నోట్లోనే మత్తుమందు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టేసి బీభత్సం సృష్టించారు. 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, విదేశీ కరెన్సీతో ఆటోలో చెక్కేసిన ఈ కిలాడీ గ్యాంగ్‌ ఉదంతం ఇప్పుడు జంట నగరాలను వణికిస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూర్‌ గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో విశ్రాంత ప్రొఫెసర్‌ మురళీమోహన్‌, ఆయన భార్య డాక్టర్‌ విజయలక్ష్మి నివాసముంటున్నారు. కొంతకాలంగా నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ఇంట్లో పని మనుషులుగా చేరి నమ్మకం సంపాదించారు. దాదాపు 10 రోజుల క్రితం మరో మహిళను తమ బంధువుగా పరిచయం చేసి ఇంట్లోనే ఉంచారు. పూర్తి ప్రణాళికతో దోపిడీకి సిద్ధమైన నిందితులు, మంగళవారం తమలో ఒకరి పుట్టినరోజు వేడుకలంటూ వృద్ధ దంపతులను నమ్మించారు. ఈ మేరకు పనిమనుషులకు చెందిన మరో నలుగురు వారింటికి వచ్చారు. రాత్రి భోజనం సమయంలో వెనక నుంచి వచ్చిన నేపాలీ గ్యాంగ్‌ వారిని బెదిరించింది. దాంతో వృద్ధ దంపతులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మమ్మల్ని చంపకండి.. మీకు ఏమీకావాలో తీసుకెళ్ళండి అంటూ ప్రాధేయపడిన వినకుండా.. వారికి మత్తు మందు ఇచ్చి.. బెడ్‌రూంలోకి తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కట్టేశారు. అనంతరం ఇంట్లోని బీరువాలను ధ్వంసం చేసి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కేజీల వెండి వస్తువులు, 3 వేల డాలర్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి తాళాలు వేసి ఆటోలో అక్కడి నుంచి పారిపోయారు. మత్తుమందు ప్రభావంతో వృద్ధ దంపతులు స్పృహ కోల్పోయి… మంగళవారం మధ్యాహ్నం వరకు తేరుకోలేదు. అనంతరం దంపతులు హెల్ప్‌… హెల్ప్‌.. అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు గమనించి ఇంటి తాళాలు పగులగొట్టి వారిని విడిపించారు. స్థానికులు వెంటనే 100కు డయల్‌ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో పరిశీలనలు చేపట్టి వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమ్మకంగా ఉంటూ తమను ఇలా చేస్తారని అనుకోలేదని వృద్ధులు విలపించారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ సుమతి
మల్కాజిగిరి సీపీ సుమతి, డీసీపీ శ్రీధర్‌, ఘటనా స్థలాన్ని బుధవారం ఉదయం సందర్శించారు. నిందితులు దొంగతనం తర్వాత ఆటోలో పరారైనట్టు గుర్తించారు. వీరు నకిలీ గుర్తింపు కార్డులతో పనిలో చేరినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ముఠాలో మీనా బహదూర్‌ (అలియాస్‌ మమత) అనే పాత నేరస్తురాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇప్పటికే ఢిల్లీ మీదుగా నేపాల్‌ సరిహద్దు దాటి ఉండవచ్చని భావిస్తున్నారు. దొంగల కోసం జవహర్‌నగర్‌ పోలీసులు ఆరు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -