లక్నో కెప్టెన్‌గా తప్పుకున్న రిషబ్ పంత్
లక్నో : డ్యాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతలను త్యజించాడు. 2026 ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 14 మ్యాచ్‌ల్లో పది పరాజయాలు చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. బ్యాటర్‌గానూ రిషబ్ పంత్ దారుణంగా నిరాశపరిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 312 పరుగులే చేశాడు. వరుసగా రెండు సీజన్లు లక్నో సూపర్‌జెయింట్స్ ప్లే ఆఫ్సకు చేరటంలో విఫలమైంది. దీంతో నాయకత్వ పగ్గాలను రిషబ్ పంత్ వదులుకున్నాడు. ‘రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాంఛైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని యాజమాన్యానికి కోరారు. ప్రాంఛైజీ పంత్ అభ్యర్థనను అంగీకరించింది. లక్నో సూపర్‌జెయింట్స్ సారథ్య బాధ్యతల నుంచి పంత్ తక్షణమే తప్పకున్నట్టు తెలియజేస్తున్నామని’ ఎల్‌ఎస్‌జీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాలు అంత సులువు కాదు. కెప్టెన్‌గా రిషబ్ పంత్ డ్రెస్సింగ్‌రూమ్‌కు అందించిన సేవలు అమూల్యం. జట్టు పుననిర్మాణం, పునవ్యవస్థీకరణపైనే ప్రస్తుతం ప్రాంఛైజీ దృష్టి పెడుతోందని ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ అన్నారు.



