భద్రతా మండలిని డిమాండ్ చేసిన ఇరాన్
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై కేవలం ఆందోళన వ్యక్తం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, లెబనాన్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయిల్‌ను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కజెమ్ ఘరీబబాదీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కాల్పుల విరమణను నిరర్ధకం చేస్తూ, పాలస్తీనియన్ల పవిత్రతను అపవిత్రం చేస్తున్న ఇజ్రాయిల్ కారణంగానే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. బీరుట్‌పై దాడి చేయకుండా ఇజ్రాయిల్‌ను అడ్డుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు చెబుతున్న మాటలు శాంతి కోసం అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలకు సంకేతంగా చూడడం కంటే కూడా ఇజ్రాయిల్ దురాక్రమణలలో అమెరికా ప్రత్యక్ష పాత్రకు ధృవీకరణగా భావించవచ్చునని చెప్పారు. ఓ స్వతంత్ర దేశపు రాజధానిపై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఒకే ఒక ఫోన్ కాల్‌తో ఆపగలిగినప్పుడు పాశ్చాత్య దేశాల రాజకీయ, సైనిక మద్దతుతో కాల్పుల విరమణ ఉల్లంఘనలు, లెబనాన్‌పై దురాక్రమణలు, భయాందోళనలతో ప్రజల పరుగులు, లెబనాన్ సార్వభౌమాధికారానికి ముప్పు…ఇవన్నీ నిరంతరంగా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు.
కాల్పుల విరమణ చర్చలకు విఘాతం
లెబనాన్, గాజాలపై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు కాల్పుల విరమణ చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. లెబనాన్‌పై దురాక్రమణలు, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం వంటి ఇజ్రాయిల్ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. లెబనాన్‌లో సహా అన్ని రకాల దాడుల నిలిపివేతకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఒక చోట దానిని ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని మొత్తంగా ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పారు. జరగబోయే హింసకు అమెరికా, ఇజ్రాయిల్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఆగని ఇజ్రాయిల్ దాడులు
దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయిల్ బాంబు దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయిల్ దాడిలో ధ్వంసమైన ఓ భవనం శిధిలాల నుంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. గాయాలతో బాధపడుతున్న ముగ్గురిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇజ్రాయిల్ సేనలు నబాతియేహ్ నగరంపై పలు వైమానిక దాడులు జరిపాయి. ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించాయి. ఇజ్రాయిల్ జరిపిన డ్రోన్ దాడిలో నబాతియేహ్ జిల్లాలో ఇద్దరు గాయపడ్డారు. జెజ్చిట్ పట్టణంలోని ఓ నర్సరీ ప్లాంటుపై జరిగిన దాడిలో అందులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు చనిపోయారు. ఇజ్రాయిల్ జరిపిన తాజా దాడులలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. ఇజ్రాయిల్ దాడుల కారణంగా పాతిక బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని లెబనాన్ ఆర్థిక మంత్రి జబర్ చెప్పారు.
ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



