మహిళలు.. ముఖ్యంగా అమ్మలూ ఇంటిల్లిపాదినీ పట్టించుకుంటారు. కానీ, తమ గురించి తాము పట్టించుకోవడం మర్చిపోతుంటారు. అందుకే, కుటుంబ ప్రాధాన్యతాక్రమంలో ఆఖరి పేరు వారిదే అయ్యి ఉంటుంది. ఇల్లు, కెరియర్, బాధ్యతలు ఇవన్నీ సరిగా నిర్వహించాల్సిన బాధ్యత అనివార్యంగా వారిపైనే ఉంటుంది. కాబట్టి, వారికి శక్తితోపాటు ఆరోగ్యమూ తప్పనిసరంటున్నారు నిపుణులు. కాబట్టి మహిళలు తినే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం…
మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పనులు, బాధ్యతలన్నీ ఒక్కరే భరించాలనే మూస ధోరణి నుండి ముందు బయటపడాలి. భర్త, పిల్లలను ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయాలి. దీంతో పాటు మంచి ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ చాలా అవసరం. ఇది ఎముకల ఆరోగ్యానికే కాదు, హార్మోనుల ఉత్పత్తికీ అవసరమంటున్నారు నిపుణులు. ఏవైనా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవాలన్నా ప్రొటీన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే పప్పులు, గుడ్డు, పనీర్, పెరుగు, చేప వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
రక్తహీనత
చాలామంది మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే అలసిపోవడం, బలహీనత, త్వరగా జబ్బుల బారిన పడటం వంటివి కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, కాయధాన్యాలు, బెల్లం, ఖర్జూరం వంటివి తీసుకుంటే హీమోగ్లోబిన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయని తెలియజేస్తున్నారు. మహిళలకు సెలియాక్ వ్యాధి, లాక్టోస్ అసహనం వంటి పోషకాహార సంబంధిత ఆరోగ్య సమస్యలు, అనీమియా వంటివి విటమిన్, ఖనిజ లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ అధ్యయనాలు అంటున్నాయి. ముఖ్యంగా, క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ చాలా అవసరమని ఆ అధ్యయనం సూచిస్తుంది.
విటమిన్ డి
ఎముక ఆరోగ్యం విటమిన్ డి మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపుతో ఉన్నప్పుడే కాదు, ప్రసవమయ్యాకా చివరికి మెనోపాజ్లోనూ ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే క్యాల్షియంతో పాటు విటమిన్ డి తగినపాళ్లలో అందాలి. కాబట్టి పాలు, పెరుగు, రాగులు, నువ్వులు వంటివి తరచూ తీసుకుంటూ రోజూ ఉదయం కొద్దిసేపు ఎండలో గడపడాలని సూచిస్తున్నారు. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఎముకలలో క్యాల్షియం నిల్వలు తగ్గి, ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కొవ్వులు
వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువెక్కుతామని చాలామంది భావిస్తుంటారు. కానీ హార్మోన్ల సమతుల్యతకు, పునరుత్పత్తి ఆరోగ్యానికి, చురుకైన మెదడుకి ఇవి తప్పనిసరంటున్నారు నిపుణులు. అందుకే నట్స్, గింజలు, అవకాడో, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు 3 ఎక్కువగా లభించే అవిసెలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
వాటర్
నీళ్లు లేకుండా వంటగదిలో క్షణం గడవదు. అయినా ఒక గ్లాసుడు తీసుకుని తాగడం మాత్రం మర్చిపోతుంటారు. శరీరం చురుగ్గా పనిచేయాలన్నా, జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగాలన్నా, అందమైన చర్మం కావాలన్నా తగినన్ని నీళ్లు తాగాలంటున్నారు నిపుణులు. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు తలనొప్పి, అలసట, ఆకలి లేకపోవడం లేదా చక్కెర తినాలనే కోరిక, కండరాల తిమ్మిరి, మలబద్ధకం లాంటి లక్షణాలు కనిపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, లెక్క చూసుకుని మరీ తాగడం మంచిదట. మాములుగా మహిళలు రోజుకు సగటున 9 కప్పులు, పురుషులు సగటున 13 కప్పుల నీటిని తాగాలని నేచరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.
సమయానికి తినాలి
పనులు ఎప్పుడూ ఉంటునే ఉంటాయి. వాటిని చేసే క్రమంలో బ్రేస్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. సగం అనారోగ్య సమస్యలకు ఇదే కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి టైంకి భోజనం చేయాలని సూచిస్తున్నారు. దీర్ఘ సమయాలు ఏది తినకుండానూ ఉండవద్దంటున్నారు. ఇది సక్రమంగా పనులు చేయనీయకుండా.. మూడ్‌నీ మార్చేస్తుందని చెబుతున్నారు. అందుకే చిన్నచిన్న విరామాలలో ఏదో ఒకటి తింటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. అందులో పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పీచు ఎక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యమిస్తే మెటబాలిజం మెరుగుపడడంతోపాటు ఆరోగ్యంగా ఉండరని అంటున్నారు.
ఇంకా ఏం చేయాలంటే
హార్మోన్ల అలజడి, బాధ్యతల ఒత్తిడి వల్ల చిరాకు, కోపం వస్తుంటుంది. నిద్రలేమి, పోషకాహార లోపం ఇందుకు తోడు అవ్వొచ్చు. అయితే ప్రధానంగా నెలసరి రావడానికి వారం రోజుల ముందు, గర్భధారణ సమయంలో, మెనోపాజ్ దశలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో చిన్న విషయానికే కస్సుబుస్సులాడటం, ఊరికే కన్నీళ్లు ఉబికి రావడం వంటి ఉద్వేగాలెన్నో కనిపిస్తాయి. అయితే, సమస్య అర్థమైనా దీని తీవ్రతను మాత్రం చాలామంది గుర్తించరు. మీరలా చేయకండి… జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోండి. ఉదయాన్నే అరగంట పాటు నడక, వ్యాయామం వంటివి చేయండి. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోకుండా సమయానికి భోజనం చేయండి. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోండి.. వేపుళ్లు, పంచదార ఉండే పదార్థాలను తగ్గించండి. రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సన్నిహితులతో మాట్లాడటం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం వంటి నచ్చిన వ్యాపకాలకు సమయం కేటాయించండి. అయినా మార్పు రాకపోతే కుంగుబాటు బారిన పడ్డారని గుర్తించండి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. అప్పుడే త్వరగా దాన్నుంచి బయటపడి సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు.



