46.8శాతం లాభాలున్న కాజీపేట సబ్‌డివిజన్‌పై నిర్లక్ష్యం
ఇద్దరు కేంద్ర మంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్న
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీల తీరుపై అసంతృప్తి
రాష్ట్ర రాజకీయ పార్టీల అసమర్ధత
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం (యూనియన్ గవర్నమెంట్) వివక్ష చూపుతోంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడ జనాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కాజీపేట రైల్వే డివిజన్ కోసం కృషి చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1,000 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటే డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనలున్నా ఇటు ప్రజాప్రతినిధులు,అధికారులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నుంచి ఒత్తిడి ఉంటే కేంద్రం ఆమోదించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే(సికింద్రాబాద్)లో సబ్ డివిజన్‌గా వున్న కాజీపేట పరిధిలో 2,600 కిలోమీటర్ల లైన్ వుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 50 శాతం ఆదాయం కాజీపేట సబ్‌డివిజన్ నుంచి మాత్రమే వస్తుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ, రైల్వే బోర్డు విస్మరించడం గమనార్హం. కాజీపేట జంక్షన్ ఉత్తర, దక్షిణ భారత దేశాలకు వారధిగా ఉండటమే కాకుండా బొగ్గు, సిమెంట్, గ్రానైట్ తదితర సరుకు రవాణాకు కేంద్రంగా వుంది. దీంతో ఈ సబ్‌డివిజన్ నుంచి ఆదాయం భారీగా సికింద్రాబాద్ డివిజన్‌కు వస్తోంది. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్తగా సికింద్రాబాద్ డివిజన్ పరిధి చాలా విస్తృతంగా పెరుగుతుంది. గుంటూరు డివిజన్‌లోని జాహన్‌పాడ్ నుంచి పంగిడిపల్లి వరకు 186 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌లో విలీనం చేశారు. రాయ్‌చూర్ (కర్నాటక) ప్రాంతంలోని గుంతకల్ డివిజన్‌లోని 98 కిలోమీటర్ల లైన్‌ను సికింద్రాబాద్‌కు కలిపారు.
కొత్తగా పెరుగుతున్న రైల్వే మార్గాలు
కొత్తగా కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలో రైల్వే మార్గాలు పెరుగుతున్నాయి. కరీంనగర్ లైన్‌లో గంగాధర నుంచి సిద్దిపేట, కొమురవెల్లి, మనోహరాబాద్, పటాన్ చెరువు వరకు 128 కిలోమీటర్ల లైన్ పనులు పూర్తయ్యాయి. రామగుండం-మణుగూరు మధ్య 226 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులకు అటవీ శాఖ అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమ య్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్-సూర్యాపేట, నల్లగొండ వరకు 86 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులకు నిధులు విడుదలయ్యాయి. డోర్నకల్-గద్వాల్ మధ్య 282 కిలోమీటర్ల మేరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సర్వేకుగాను నిధులు మంజూరు చేశారు. రైలు మార్గాలు సరిపోక ఇప్పటికే మూడు లైన్‌లున్న సికింద్రాబాద్-కాజీపేట మధ్య 4వ లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులు పురోగతిలో వున్నాయి. కాజీపేట-చెన్నయ్ మధ్య 4వ లైన్ నిర్మాణానికి నిధులిచ్చారు. ఆదాయం, రవాణ రద్దీ అత్యధికంగా ఉండటం వల్లే అదనపు రైల్వే లైన్‌లు మంజూరయ్యాయి.
రాజకీయ వివక్షతో నిర్లక్ష్యం
గతంలో రాంవిలాస్ పాశ్వాన్ రైల్వే మంత్రిగా వున్నప్పుడు బీహార్ రాష్ట్రంలో 2,300 కిలోమీటర్ల రైల్వే లైన్ పరిధిలోనే మూడు రైల్వే డివిజన్‌లను, ఒక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. జాఫర్ షరీఫ్ రైల్వే మంత్రిగా వున్న సందర్భంలో కర్నాటక రాష్ట్రంలో సౌత్ సెంట్రల్ రైల్వేలో వున్న కొంకణ్ రైల్వే డివిజన్‌ను హుబ్లీలో విలీనం చేసుకొని కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ రైల్వే డివిజన్ కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో వున్న గుంటూరును రైల్వే డివిజన్ కేంద్రంగా చేశారు. సికింద్రాబాద్ డివిజన్ కేంద్రానికి 132 కిలోమీటర్ల దూరంలో వున్న కాజీపేటను ఎందుకు రైల్వే డివిజన్ చేయడం లేదని స్థానిక యువత, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. డివిజన్ కేంద్రం అయితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలోని మధిర నుంచి కొండపల్లి వరకు సుమారు 36 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి విజయవాడ డివిజన్‌కు మార్చినా డిప్యూటీ సీఎం స్పందించకపోవడం మన నేతల నిర్లక్ష్యానికి నిదర్శనం.
చిత్తశుద్ధి లేని నేతలు
తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రజాప్రతినిధులకు, రాజకీయ పార్టీల నేతలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కాజీపేట రైల్వే డివిజన్‌ను సాధించలేకపోతున్నాం. కేరళ రాష్ట్రానికి వందేభారత్ రైళ్లను కేటాయించకపోతే అక్కడ అన్ని పార్టీల ఎంపీలు ఏకమై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న, కేంద్రంలో ఉన్న అధికార పార్టీల ఎంపీలు, రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట రైల్వే సబ్ డివిజన్ నుండే అధిక లాభాలు వస్తుండటమే కాకుండా రైల్వే లైన్ గణనీయంగా పెరుగుతుంది. విభజన చట్టంలో భాగంగా ఏపీలో విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా కొత్తగా విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను కూడా సాధించుకోగలిగారు. ఇకనైనా చిత్తశుద్ధితో పోరాటానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు దిగితేనే కాజీపేట రైల్వే డివిజన్‌ను సాధించుకోగలం.
దేవులపల్లి రాఘవేందర్‌రావు, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్
కాజీపేటపై కేంద్రం వివక్ష
కాజీపేట రైల్వే సబ్‌డివిజన్‌ను రైల్వే డివిజన్ చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ వివక్ష చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోనే యేటా అత్యధికంగా 50 శాతం ఆదాయాన్నిస్తూ, 2,600 కిలోమీటర్ల రైల్వే లైన్ వున్న కాజీపేట సబ్‌డివిజన్ భౌగోళికంగా కూడా ఉత్తర, దక్షిణ భారత దేశానికి వారధిగా వుంది. సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో ఇప్పటికే అధికారులపై తీవ్ర పని ఒత్తిడి వుంది. కొత్తగా రైల్వే పునర్వవస్థీకరణలో భాగంగా కాజీపేట సబ్‌డివిజన్‌ను వెంటనే రైల్వే డివిజన్‌గా ప్రకటించాలి. ఈ సబ్‌డివిజన్ పరిధిలో రైల్వే మార్గం పెరుగుతున్నందునా బొగ్గు, గ్రానైట్, సిమెంట్, పారా బాయిల్డ్ రైస్ రవాణాలో కీలకంగా వున్న కాజీపేటకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ విషయంలో కేంద్రం తన వివక్షను కొనసాగిస్తే రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
జి.ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి



