Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజులై 1 నుంచి వీబీజీఆర్‌ఏఎంజీ అమలు​

జులై 1 నుంచి వీబీజీఆర్‌ఏఎంజీ అమలు​

- Advertisement -

కొత్త చట్టం అమలుపై సన్నాహాలు
నష్టాన్ని భ‌ర్తి చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాం
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌


​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీఆర్‌ఏఎంజీ చట్టం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీజీఆర్‌ఏఎంజీ చట్టంలోని ప్రధాన నిబంధనలు, వాటి ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం తదితర అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే, కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్‌లలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాల్సి ఉండటం, రాష్ట్రాలకు ముందుగా నిర్ణయించిన నిర్ణీత నిధుల కేటాయింపు విధానం అమలు చేయడం, కేంద్ర రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ కార్మికులకు డిమాండ్ మేరకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే విధానాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా అధికారులు వివరించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం, కేంద్రం నిర్ణయించే కేటాయింపులకు మించి అవసరమయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే అవకాశాలు, కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్య విధానంలో మార్పులు కోరడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

కర్నాటక, కేరళం, జార్ఖండ్ రాష్ట్రాలు వీబీజీ ఆర్‌ఏఎంజీ చట్టంపై అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గ్రామీణ ఉపాధి హక్కు, రాష్ట్రాల ఆర్థిక భారం, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, అమలుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలని ఆదేశించారు. గ్రామీణ పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కొత్త చట్టం అమలుతో తెలంగాణ కార్మికులు, రైతులు, గ్రామీణ కుటుంబాలు నష్టపోకుండా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్త చ‌ట్టంతో జ‌రిగే న‌ష్టాన్ని భ‌ర్తి చేసే విధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామని సీతక్క పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ స‌మావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన‌కిషోర్, క‌మిష‌న‌ర్ దివ్యా దేవ‌రాజ‌న్, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ డి. శ్రీల‌క్ష్మీ, జాయింట్ క‌మిష‌న‌ర్ న‌ర్సింహులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -