Wednesday, June 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకౌలు రైతులను తక్ష‍ణమే గుర్తించాలి

కౌలు రైతులను తక్ష‍ణమే గుర్తించాలి

- Advertisement -

సాగుదారులకే రైతు భరోసా, పథకాలు వర్తించేలా చూడాలి
వారికి గుర్తింపుకార్డులివ్వాలి
తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సదస్సులో వక్తలు
1816 మంది కౌలు రైతులపై చేపట్టిన సర్వే రిపోర్టు వెల్లడి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ​తెలంగాణలో కౌలు రైతులను తక్ష‍ణమే గుర్తించాలనీ, వారికి గుర్తింపు కార్డులిచ్చి నిజమైన సాగుదారులకే రైతు భరోసా, వ్యవసాయ పథకాలు వర్తించేలా చూడాలని పలువురు వక్తలు డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని బషీర్‌‌బాగ్‌ ‌ప్రెస్‌‌క్లబ్‌‌లో ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ ‌డి.నర్సింహారెడ్డి, రైతు స్వరాజ్యవేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి అధ్యక్ష‍తన తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. 22 జిల్లాల పరిధిలో 57 గ్రామాల్లో 1,816 రైతులను ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా రూపొందించిన సర్వే రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్‌(‌రిటైర్డ్‌) ‌సుదర్శన్‌‌రెడ్డి మాట్లాడుతూ..పట్టాదారు పాసుపుస్తకంలో వాస్తవ సాగుదారు కాలం 16ని పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. సాగుదారులకు రైతు భరోసా ఇవ్వడమంటే వారి శ్రమకు, భూమిలేని వారికి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. వ్యవసాయం పేరిట ఏర్పాటు చేస్తున్న ఫామ్‌‌హౌజ్‌లు అసాంఘిక కార్య క్రమాలకు అడ్డాగా మారుతున్నాయనీ, ఫామ్‌‌హౌజ్‌ ‌కల్చర్‌‌ ను అరికట్టాలని రాష్ట్ర సర్కారుకు సూచించారు. ఫామ్‌‌హౌస్‌ యజమానులకు ‌పక్ష‍పాతి కాకుండా నిజంగా సాగుచేస్తున్న రైతుల పక్ష‍పాతిగా సీఎం రేవంత్‌‌రెడ్డి ఉండాలని ఆకాంక్ష‍ించారు. ‌కౌలు రైతులను గుర్తించేందుకు ఉద్దేశించిన 2011 భూ కౌలుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కౌలు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణ రైతు కమిషన్‌ ‌చైర్మెన్‌ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయంలో కౌలు రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అంగీకరించారు. కౌలు రైతులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ, అనేక చర్చల అనంతరం, పలు అంశాలను పరిగణనలోకి తీసుకునే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తచేశారు. కౌలు రైతులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర సంక్ష‍ోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని సీఎంను కోరారు. అభివృద్ధి పేరుతో పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్‌ ‌భూములను లాక్కోవడాన్ని పాలకులు ఆపేయాలని సూచించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ.76 వేల కోట్ల రైతు భరోసా నిధులిస్తే అందులో రూ.27 వేల కోట్లకుపైగా ఏమాత్రం సాగుతో సంబంధం లేని ధనవంతుల ఖాతాల్లో పడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని ఎత్తిచూపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీనటులు, పారిశ్రామికవేత్తలకు రైతు భరోసా అవసరమా? అని ప్రశ్నించారు. వారికి కాకుండా నిజమైన సాగుదారులకు రైతు భరోసా ఇవ్వాలని కోరారు.

జస్టిస్‌ (రిటైర్డ్‌) ‌చంద్రకుమార్‌ ‌మాట్లాడుతూ.. ఇన్‌‌కమ్‌ ‌ట్యాక్స్‌ ‌కట్టేవారిని రైతు ిరోసా ఇవ్వొద్దని సూచించారు. ఎరువులు కొనాలన్నా, పంట అమ్ముకోవాలన్నా ఓటీపీలు ఎందుకు? పంట పండించే కౌలు రైతులను గుర్తించరా? వారు పంటలను దళారులకు అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా సాగుచేస్తున్న రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. కౌలురైతులకు ఉన్న హక్కులను అమలు చేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కిసాన్ అధికార మంచ్ ప్రతినిధి డాక్టర్‌ రుక్మిణి రావు, రైతు స్వరాజ్యవేదిక నాయకులు బి.కొండల్‌ ‌రెడ్డి, విస్సాకిరణ్‌, టి.హరీశ్‌, డీబీఎఫ్‌ ‌జాతీయ అధ్యక్ష‍ులు శంకర్‌, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ సభ్యులు ఎం. వెంకటయ్య, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీకి చెందిన చుక్కమ్మ, పిలుపు సంస్థకు చెందిన ఎం. జనార్దన్, సత్యశోధక సంఘం ప్రతినిధి విక్రమ్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలకు చెందిన నలుగురు కౌలు రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -