Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

- Advertisement -

– మోరిగాడి రమేష్, సీఐటీయూ జిల్లా నాయకుడు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

కార్మిక లోకాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు మోరిగాడి రమేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా గురువారం ఆలేరు పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు.

ఈ కోడ్ల ద్వారా కార్మికుల వేతనాలు, హక్కులు, సమ్మె హక్కులను హరిస్తూ వారిని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దేశంలోని కార్మికులు,కర్షకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన వర్గాలపై మనువాద సిద్ధాంతాలను రుద్దుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు,రైతులు ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ప్రజలు భవిష్యత్తులో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.

దేశంలోని సుమారు 40 కోట్ల అసంఘటిత కార్మికులు,వారి కుటుంబాలు ఈ చట్టాల వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. పేదల శ్రమను కార్పొరేట్ కంపెనీల లాభాలకు అనుకూలంగా మార్చే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకువస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు కార్మిక వర్గం పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ. ఇక్బాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు, సీఐటీయూ మండల కన్వీనర్ సంఘీ రాజు, సీఐటీయూ నాయకులు వడ్డేమాన్ బాలరాజు, దూడల శ్రీధర్, కే.కిష్టయ్య, అయోధ్య బాల్ నరసింహ, నంద ఐలయ్య, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బొమ్మకంటి బాలరాజు, మిషన్ భగీరథ మండల అధ్యక్షుడు గ్యాదపాక యాదగిరి, కార్మికులు మారుపెల్లి కుమార్ సిహెచ్ మల్లయ్య అంగన్వాడి సంఘం నాయకులు గంగుల రమ, పద్మ , లక్ష్మి, మంజుల, అనురాధ, పుష్పలత శారదా ఆశా వర్కర్లు గంగుల లలిత, బి రాధిక, ఎన్ పావని, ఎం నీలవేణి, ఆర్ కల్పన, తాండ్రు సుగుణ, ఎం ఎల్లమ్మ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -