Friday, February 13, 2026
E-PAPER
Homeమానవిసాహిత్యం ఆలోచింపజేస్తుంది..

సాహిత్యం ఆలోచింపజేస్తుంది..

- Advertisement -

ఫహనాజ్‌ బతుల్‌.. సాహిత్యమంటే ఏమిటో తెలియని కుటుంబంలో పుట్టారు. చిన్నతనంలో నేర్చుకున్న కుట్లు అల్లికలే ఆమెను సాహిత్యం వైపుకు పయనించేలా చేశాయి. కష్టపడి చదివి ఐఐటీ ఖరగ్పూర్‌లో సీటు తెచ్చుకున్నారు. అప్పుడే రచనలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత గణితంలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ తన రచనలను కొనసాగించారు. సమాజంలో మంచి మార్పుకు తన రచనలు భాగం కావాలని కోరుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

బాల్యం చదువు ఎలా కొనసాగింది?
నాన్న ఉద్యోగరిత్యా గుంటూరు నుండి ఏలూరు వచ్చారు. దాంతో నేను ఏలూరులోనే పుట్టి పెరిగాను. అక్కడి సరస్వతి పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివాను. ప్రభుత్వ ఉన్నత బాలిక పాఠశాలలో 6 నుండి 12 వరకు చదివాను. నేను పాఠశాలలో చదివేటప్పుడు నాన్న పదవీ విరమణ చేశారు. అప్పట్లో సొంత ఇల్లు కూడా లేదు. ఆర్థిక ఇబ్బందులు. అప్పటికి మేము ఏలూరులో ఉండేవాళ్లం. దాంతో అక్కడే సెటిల్‌ అయిపోయాము. మా చిన్నతనంలో అష్టా చమ్మా, పచ్చీస్‌, దాడి చింత పిక్కలు, అచ్చం గాయలు వంటి ఆటలు ఆడుకునే వాళ్లం.

12వ తరగతి తర్వాత ఏలూరులో సెంట్‌ థెరీసా మహిళా కళాశాలలో బీఎస్సీ చదివాను. బీఎస్సీ చదివేటప్పుడు నాకు హిందీ స్కాలర్షిప్‌ వచ్చింది. మొదటిసారి మాత్రం ఫీజు అమ్మ కట్టారు. ఆ తర్వాత స్కాలర్షిప్‌ డబ్బులతో ఫీజులన్నీ నేనే కట్టుకున్నాను. ఎమ్మెస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఐఐటీ ఖరగ్పూర్‌లో గణితంలో పరిశోధన చేశాను. పీహెచ్‌డీ డిగ్రీ వచ్చింది. హైదరాబాద్‌ జేఎన్టీయూహెచ్‌లో గణిత ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాను.

సాహిత్యంతో మీ పరిచయం..?
చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర తప్ప వేరే ఏమీ చదవలేదు. అవి కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఎందుకంటే ఇంట్లో కొనేవారు కాదు. విద్యార్థిగా ఉన్నప్పుడు కథలు, నవలలు వంటివి ఏమీ చదవలేదు ఎందుకంటే నా ధ్యాస ఎప్పుడూ చదువు మీదే ఉండింది. అయితే ఎప్పుడైనా ఖాళీ సమయంలో పెయింటింగ్స్‌ చేసుకునేదాన్ని. అలాగే కుట్లు కుట్టే దాన్ని. నేను జీవితంలో మొదటి పెయింటింగ్‌ ఏడవ తరగతిలో ఉన్నప్పుడు చేశాను.

మరి రాయడంలో మీకు స్ఫూర్తి ఎవరు?
స్ఫూర్తి అంటూ ఎవరూ లేదు. నేను ఎమ్మెస్సీ తర్వాత రీసెర్చ్‌ చేయడానికి ఐఐటీ ఖరగ్పూర్‌లో చేరాను. అక్కడ మార్కెట్లో ఒక దుకాణంలో తెలుగు పుస్తకాలు చూశాను. ఆంధ్రభూమి వార పత్రిక, వనిత, వనితా జ్యోతి కొనే దాన్ని. నేను మోడల్‌ టైప్‌లో గ్రీటింగ్‌ కార్డ్స్‌ స్వయంగా తయారు చేసేదాన్ని. వనిత మాస పత్రికల్లో ‘తీరిక వేళలో’ అనే శీర్షికలో కుట్లు అల్లికలు, డెకరేషన్‌ పీసులు తయారు చేయడం అటువంటివి పడుతూ ఉండేవి. నాకు గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారు చేసే విధానం రాయాలనిపించింది. వెంటనే ఎడిటర్‌కి ఉత్తరం రాసాను. కొన్ని రోజులలో జవాబు వచ్చింది. ‘గ్రీటింగ్‌ కార్డుల ఫోటోలు పంపించాలి, అవసరమైతే బొమ్మలు వేయాలి. బాగుంటే ప్రచురణకి స్వీకరిస్తాం’ అని రాశారు.

నేను నాలుగు విధాల గ్రీటింగ్‌ కార్డులను దూదితో, క్రేప్‌ కలర్‌ పేపర్‌తో, బట్ట ముక్కలతో, ఊలు ముక్కలతో గ్రీటింగ్‌ కార్డులు తయారుచేసి ఎలా తయారు చేయాలో రాసి, ఫొటోలు జత చేసి పంపించాను. ‘మీ రచన, గ్రీటింగ్‌ కార్డులు ప్రచురణకు స్వీకరించామని చెప్పటానికి సంతోషిస్తున్నా. వీలు వెంబడి ప్రచురణ జరుగుతుంది’ అని కొన్ని రోజుల తర్వాత ఉత్తరం వచ్చింది. ప్రచురణ అయ్యే వరకు నేను ఈ విషయం ఎవరితో చెప్పలేదు. 1980 నవంబర్‌లో వనిత దీపావళి ప్రత్యేక సంచికలో ఆ వ్యాసం ప్రచురించబడింది. ప్రింట్‌లో మూడు పేజీలు వచ్చింది. ఇదే నా మొదటి రచన. అప్పటి నుండి రాయడం మొదలుపెట్టాను.

ఇప్పటి వరకు మీ రచనలు..?
చాలా కథలు ఆన్లైన్‌, ప్రింట్‌ బుక్స్‌లో ప్రచురించబడ్డాయి. చాలా కవితలు ప్రచురించబడ్డాయి. తీరిక వేళ్ళల్లో కుట్లు అల్లికలు, డెకరేషన్‌ పీసులు తయారు చేయడం, గ్రీటింగ్‌ కార్డ్స్‌ తయారు చేయడం, వంటలు మొదలగు వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఉదయం పత్రికలో నా వ్యాసాలు ఎక్కువగా ప్రచురించబడేవి. కానీ అది మధ్యలో ఆగిపోయింది. అలాగే కలువబాల (మహిళా మాసపత్రిక)లో కూడా నా వ్యాసాలు వచ్చేవి. 1994లో అది ఆగిపోయింది. ఇప్పటి వరకు స్వర్ణ(స్వర్ణ, మరో రెండు పెద్ద కథలు), జీవిత చక్రం (ప్రత్యేక బహుమతి వచ్చిన నా మొదటి నవల), మట్టిలో మాణిక్యం (కథల సంపుటి), భావాల షహానా(సప్తపదులు) అనే నాలుగు పుస్తకాలు ముద్రించాను. భవిష్యత్తులోనూ మంచి రచనలు చేస్తూ సమాజ మార్పులు నా వంతు భాగస్వామిని కావాలనుకుంటున్నాను.

ఉద్యోగం, కుటుంబం, సాహిత్యం ఈ మూడింటిని సమన్వయం చేసుకునే క్రమంలో ఏమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా?
నా రచనా వ్యాసంగం మొదలైంది ఐఐటి ఖరగ్పూర్‌లో రీసెర్చ్‌ చేసేటప్పుడు. నేను చాలా కాలం చదువు రీత్యా, ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా ఉన్నాను. 1986 నుండి 2006 వరకు ఒక్కదాన్నే ఉన్నాను. కాలేజీ పని కాలేజీలోనే. ఇంటి దగ్గర చదవటం, రాయడం, కుట్లు అల్లికలు తయారు చేయడం. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే ఇంటి దగ్గర కూడా కాలేజీ వర్క్‌ చేస్తుంటాను. కాబట్టి నాకు సమస్యలు ఏమీ రాలేదు. అయితే 2003 నుండి 2021 వరకు పెద్దగా రచనలు ఏమీ చేయలేదు.

ఇప్పటి వరకు మీరు అందుకున్న పురస్కారాలు?
2022లో ప్రతిలిపిలో పదివారాల సీరియల్‌ స్వర్ణ రాస్తే ప్రత్యేక బహుమతి వచ్చింది. 60 భాగాల సీరియల్‌ ‘జీవిత చక్రం’కి(ఇదే నా మొదటి నవల) ప్రత్యేక బహుమతి వచ్చింది. రెండవ నవల ఆలంబన గ్రామం(60 భాగాలు)కి ప్రతిలిపిలో ప్రశంసా పత్రం వచ్చింది. ప్రతిలిపిలో డైరీ (జ్ఞాపకాలు) వ్యాసాలకి చాలాసార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2023, 2024 తెలంగాణ మహిళా కథ పోటీ త్రైమాసిక శ్రీవాద పత్రిక, తెలుగు తల్లి కెనడా మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ప్రత్యేక బహుమతులు వచ్చాయి. విశాలాక్షి మాస పత్రిక వాళ్లు నిర్వహించిన మినీ కథల పోటీలో ఒకసారి బహుమతి వచ్చింది. కవితల గ్రూపులలో కూడా బిరుదులు అందుకున్నాను. సీత చారిటబుల్‌ ట్రస్ట్‌, అభిజ్ఞ భారత్‌ ఆర్గనైజేషన్‌, అక్షరయాన్‌ సంయుక్త నిర్వహణలో 2025 మాతృ వందనం పురస్కారం అందుకున్నాను.

సమాజంపై సాహిత్యం ఎలాంటి ప్రభావం చూపుతుందనుకుంటున్నారు?
పాఠకులు చదివిన తర్వాత ఆలోచిస్తారు. అందరూ కాకపోయినా కొంతమందిలో అయినా మార్పు కచ్చితంగా వస్తుంది. ఆ మార్పు మంచి వైపు ఉండాలి. సమాజంపై సాహిత్య ప్రభావం తప్పకుండా ఉంటుంది.

అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -