రూ. 5,000 కోట్ల దోపిడీకి చెక్ పెట్టిన హైదరాబాద్ సిటీ పోలీసులు
నాలుగు రాష్ట్రాల్లో ముమ్మర దాడులు
ఆరుగురు నిందితుల అరెస్ట్
కంపెనీ పెట్టిన 18 రోజులకే ఆట కట్టించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ముసుగులో ఐదు వేల కోట్ల దోపిడీకి ప్లాన్ వేసిన గొలుసుకట్టు ముఠా పన్నాగాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ముమ్మర దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో గురువారం విలేకరుల సమావేశంలో నగర సీపీ వీసీ సజ్జనార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ‘గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిషేధిత ‘క్యూనెట్’ సంస్థ.. కొత్తగా ‘ఇగ్నైట్’ పేరుతో అవతారమెత్తి దందాకు తెరలేపింది. ఈ ముఠా గుట్టును పసిగట్టిన హైదరాబాద్ సిటీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం చాకచక్యంగా వ్యవహరించింది. ఈ నయా సంస్థ ఏర్పాటైన 18 రోజుల్లోనే దాడి చేసి, దేశవ్యాప్తంగా జరగబోయే దాదాపు రూ. 5,000 కోట్ల భారీ మోసాన్ని మొగ్గలోనే తుంచేసింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ముఠా వేర్వేరు మార్గాల్లో ముగ్గురు బాధితులను నమ్మించి రూ. 1.87 లక్షలు కాజేసిన ఘటనపై జూన్ 5, 6 తేదీల మధ్య పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
బాధితులు ఒక్కొక్కరు రూ. 61,639 నుంచి రూ. 63,899 వరకు చెల్లించి మోసపోయారు. వీరిని బుట్టలో వేసుకోవడానికి నిర్వాహకులు వేర్వేరు మార్గాలను ఎంచుకున్నారు. ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించగా, మరొకరిని ఆన్లైన్ జూమ్ ప్రెజెంటేషన్ ద్వారా, ఇంకొకరిని పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. ఈ ముగ్గురు బాధితులకూ వేర్వేరు మార్గాల్లో ఎర వేసినప్పటికీ డబ్బు లను మాత్రం ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నారు. కోల్క తాలోని భవానీపూర్ శాఖకు చెందిన ‘పారస్నాథ్ మెర్కంటైల్ ప్రయివేటు లిమిటెడ్’ ఖాతాకు ఈ సొమ్ము చేరింది. ఈ మూడు ఘటనలపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదైన ప్పటికీ, గతంలో నిషేధానికి గురైన ‘క్యూనెట్’ సంస్థ కొత్త రూపంలో మళ్లీ రంగంలోకి దిగిందని గుర్తించిన దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ కేసును సీసీఎస్ ఆర్థిక నేరాల విభా గానికి బదిలీ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
25 ఏండ్లుగా రంగులు మారుస్తూ..
ఈ అంతర్జాతీయ నెట్వర్క్ హాంగ్‌కాంగ్ కేంద్రంగా ఉంటూ, 25 ఏండ్లుగా పేర్లు మారుస్తూ అమాయకులను దోచుకుంటోందని దర్యాప్తులో తేలింది. గోల్డ్‌క్వెస్ట్ (1998-2005) ఏర్పాటు చేసి చెన్నయ్ కేంద్రంగా ప్రారంభమై లక్షలాది మందిని ముంచేసింది. 10కి పైగా దేశాలు దీనిని నిషేధించాయి. అనంతరం క్వెస్ట్‌నెట్ (2005-2012) పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేయగా 50 వేలకు పైగా ఫిర్యాదులతో దేశాన్ని కుదిపే సింది. అనంతరం క్యూనెట్ / విహాన్ (2012-2026)పై ముంబయి, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూర్, పూణె తదిరత నగరాల్లో ఈఓడబ్ల్యూ కేసులతోపాటు ఈడీ రంగంలోకి దిగి ఆస్తులు జప్తు చేసింది. ఇగ్నైట్ (ప్రస్తుత రూపం) గత సంస్థలపై పోలీసుల నిఘా పెరగడంతో మే 18, 2026 న చంఢీఘడ్ లో ‘ఇండీ కనెక్ట్ వెంచర్స్ ప్రయివేటు లిమిటెడ్’ పేరుతో కొత్త అవతారం ఎత్తింది. ఒకే తరహా నెట్వర్క్ మోసానికి సంబంధించి హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లోని మూడు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోద య్యాయి. బాధితులను వలలో వేసుకోవడానికి నిందితులు వేర్వేరు పద్ధతులను ఉపయోగించినప్పటికీ, చివరికి ఇదంతా ఒకే ముఠా చేసిన మోసమని పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన ఒనియల్ గుప్తా, నోయిడాకు చెందిన ఒనియల్ గుప్తా, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ష హరుకు చెందిన ప్రియాన్షు, పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాకు చెందిన ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు.
బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్ము ఏ విధంగా చేతులు మారింది? చివరకు అది ‘ఇగ్నైట్’ ఖాతాల్లోకి ఎలా చేరింది? అనే అంశాలపై సాగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా తెరవెనుక ఒక అంతర్జాతీయ నిధుల రవాణా ముఠా పనిచేస్తోందని బయటకు వచ్చింది. నిందితులు అత్యంత పథకం ప్రకారం ఏడు దశల్లో ఈ నిధులను భారత్ నుంచి హాంగ్ కాంగ్‌కు మళ్లించినట్టు మనీ ట్రయిల్ ద్వారా నిర్ధారణ అయింది. గోల్డ్‌క్వెస్ట్ నుంచి నేటి ఇగ్నైట్ వరకు, ఈ నెట్వర్క్ మారినా నాలుగు రూపాల వెనుక ఉన్న అసలు సూత్రధారుల లింకులను క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నామని సీపీ తెలిపారు. భారతదేశంలో కొనసాగుతున్న అన్ని రకాల డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఎంఎల్ఎమ్ సంస్థల నిర్వాహకులు మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల కు పాల్పడితే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ శ్రీనివాస్, డీసీపీ చైతన్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.



