Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా

హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా

- Advertisement -

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌ సిటీలోని యూసుఫ్‌గూడలోని సర్వే నంబర్‌ 45లో రెండు ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడంలో జాప్యం చేసిన హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది. జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే హైడ్రా తరఫు కౌంటర్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి సూచించింది. జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ కేసు విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. ఈ భూమికి సంబంధించిన కేసులో గతంలోనే కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాకు పలుమార్లు అవకాశాలు కల్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్లు సమర్పించామని హైడ్రా తరఫు న్యాయవాది పేర్కొన్నప్పటికీ, సాంకేతిక కారణాలతో అవి రిజిస్ట్రీ వద్ద తిరస్కరణకు గురైనట్టు కోర్టు దృష్టికి వచ్చింది. సంబంధిత కేసుల్లో ఇప్పటి వరకు ఒక్క సరైన కౌంటర్‌ కూడా దాఖలు కాలేదని తెలుసుకున్న న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ మహమ్మద్‌ షఫహతుల్లా తరఫు న్యాయవాది వాదిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2008లో భూమి తమ స్వాధీనానికి అప్పగించబడిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి గతంలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చినా, వాటిని పట్టించుకోకుండా హైడ్రా అధికారులు మార్చి 18న పోలీసుల సహాయంతో ప్రహరీ గోడను కూల్చివేశారని ఆరోపించారు. అనంతరం ముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఆ స్థలాన్ని హౌసింగ్‌ బోర్డు సమగ్ర గృహ నిర్మాణ పథకానికి చెందిన బహిరంగ ప్రదేశంగా ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ అధికారులు వాటిని లెక్కచేయలేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -