బిస్లరీ వాటర్ కంపెనీ
యాజమాన్యం దుర్మార్గం!
యూనియన్ నాయకులను సస్పెండ్ చేసిన యాజమాన్యం
ఎనిమిది నెలలుగా డీసీఎల్‌లో నడుస్తున్న కేసు
కేసు నడుస్తుండగానే ఇతర రాష్ట్రాలకు కార్మికుల ట్రాన్స్‌ఫర్
రిపోర్టు చేయలేదనే సాకుతో ఉద్యోగాల తొలగింపు
రెండు రోజులుగా
సమ్మె చేస్తున్న కార్మికులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పేరుకే ఇంటర్నేషనల్ కంపెనీ.. కంపెనీలో కార్మికుల హక్కులను, ఐఎల్‌ఓ నిబంధనలు పాటించకుండా కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ యదేచ్ఛగా శ్రమదోపిడికి పాల్పడుతున్నది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేటు కంపెనీలో 2025 అక్టోబర్ నెలలో కార్మికులు తమ హక్కుల రక్షణ కోసం యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. యూనియన్ అంటేనే పడని కంపెనీ యాజమాన్యం యూనియన్ ఏర్పాటు చేసుకున్న నాయకత్వంపై తమ ప్రతాపం చూపింది. యూనియన్ ప్రధాన కార్యదర్శితో పాటు మరో నలుగురు కార్మికులను కంపెనీ నుంచి తొలగించింది. కేవలం యూనియన్ పెట్టుకున్నారనే సాకుతో ఉద్యోగం నుంచి తొలగించి తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది కంపెనీ యాజమాన్యం.
డీసీఎల్‌లో కేసు వేసిన కార్మికులు..
సంగారెడ్డి జిల్లా ఐడీఏ పాశమైలారంలో గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బిస్లరీ ఇంటర్నేషన్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ (వాటర్) ఏర్పాటు చేశారు. కంపెనీలో యూనియన్ పెట్టుకున్నారనే సాకుతో యూనియన్ నాయకత్వాన్ని కంపెనీ యాజమాన్యం సస్పెండ్ చేయగా సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ వద్ద కేసు వేశారు. గత ఎనిమిది నెలలుగా డీసీఎల్ వద్ద కార్మిక సంఘానికి, యాజమాన్యానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. డీసీఎల్ సైతం కంపెనీలో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినా.. యాజమాన్యం స్పందించకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నది. ఎనిమిది నెలలుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నది. అంతే కాకుండా ఐదు మంది యూనియన్ నాయకులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసింది. అందులో ఆసోంలోని గౌహతి ప్లాంటుకు ఇద్దరిని, తమిళనాడులోని కోయంబత్తూరు ప్లాంటుకు మరో ముగ్గురిని ట్రాన్స్‌ఫర్ చేసింది. లేబర్ కోర్టులో కేసు నడుస్తుండటంతో దూర ప్రాంతం వెళ్లి డ్యూటీలు చేయలేమని, ఇదే ప్లాంటులో ఉద్యోగం ఇవ్వాలని డీసీఎల్ ద్వారా చెప్పించినా ‘బదిలీ చేశాం.. అక్కడికి వెళ్లి రిపోర్టు చేయాలి’ అని ఒత్తిడి తెచ్చింది. జూన్ 1 తేదీన బదిలీ ఐనా కంపెనీకి వెళ్లి రిపోర్టు చేయలేదనే సాకుతో కార్మికులు ఐదు మందికి సంబంధించి పైనల్ సెటిల్‌మెంట్ చేసి వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులను డిపాజిట్ చేశారు.
రెండు రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులు..
ఉద్యోగం నుంచి ఐదు మంది కార్మికులను తొలగించడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. గత 13 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నామని, కంపెనీ యాజమాన్యం తమతో వెట్టి చాకిరి చేయించుకుని కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, అందుకే యూనియన్ ఏర్పాటుచేసుకున్నామని కార్మికులు తెలిపారు. 12 గంటల డ్యూటీ చేస్తే భోజనం సౌకర్యం కల్పించాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. అదే విధంగా కంపెనీలో క్యాంటిన్ సైతం ఏర్పాటు చేయలేదు. అవే కాకుండా అది వాటర్ కంపెనీ అయినా కంపెనీలో తాగేందుకు నీరు ఏర్పాటుచేయలేదు. బయటకు వెళ్లి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది. కాగా బిస్లరీ కంపెనీలో 40మంది పర్మినెంట్, న్యాప్స్ పేరిట 10 మంది, కాంట్రాక్టు కార్మికులు 200 మంది వరకు పనిచేస్తున్నారు. కంపెనీలో తొలగించిన యూనియన్ నాయకులను విధుల్లోకి తీసుకోవాలని, అప్పటి వరకు విధులకు హజరుకాకుండా సంపూర్ణంగా సమ్మె చేస్తామని ప్రకటించారు. దాంతో రెండు రోజులుగా పర్మినెంట్ కార్మికులు విధులకు హాజరుకాకుండా కంపెనీ గేటు ముందు బైటాయించి సమ్మె చేస్తున్నారు.
యూనియన్ పెట్టామని ఇతర రాష్ట్రాలకు బదిలీ
బిస్లరీ వాటర్ కంపెనీలో కార్మికులకు సౌకర్యాలు కల్పించకపోవడంతోనే యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. యూనియన్ ఏర్పాటు చేశామనే సాకుతో యూనియన్ నాయకత్వాన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. కావాలనే మమ్మల్ని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారు. డీసీఎల్ దగ్గర ఇక్కడి కంపెనీలోనే ఉద్యోగం ఇవ్వాలని అడిగితే సరే అన్నారు. కానీ వేరే ప్లాంట్లకు బదిలీ చేస్తే అక్కడికి వెళ్లి రిపోర్టు చేయలేదనే కారణంతో పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించి మా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేశారు. యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే వరకు సీఐటీయూ అండతో సమ్మె కొనసాగిస్తాం.
బిస్లరీ కంపెనీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి
యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు
‘బిస్లరీ’ కంపెనీలో కార్మికులు యూనియన్ పెట్టుకున్నారనే సాకుతో యూనియన్ ప్రధాన కార్యదర్శితో పాటు ఐదు మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇతర రాష్ట్రాలకు బదిలీ చేశారు. వారు అక్కడికి వెళ్లలేదని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారు. కంపెనీ పేరుకు మాత్రం ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్.. కానీ అంతర్జాతీయ ఐఎలఓ నిబంధనలను పట్టించుకోవడం లేదు. కార్మికులకు కనీసవేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించలేదు. కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లతోనే యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది. బిస్లరీ కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. యూనియన్‌ను గురించి వేతన ఒప్పందం చేయాలి. జీఓ 6 ప్రకారం కనీన వేతనాలు అమలు చేయాలి. లేనిచో పోరాటం ఉధృతం చేస్తాం.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్



