Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంనేరపూరిత కుట్రకు ఆధారాల్లేవ్

నేరపూరిత కుట్రకు ఆధారాల్లేవ్

- Advertisement -

ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే
న్యూస్‌క్లిక్, ‌దాని వ్యవస్థాపకుడిపై 
పోలీస్‌ ఎఫ్‌ఐఆర్, ఈడీ విచారణను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు


​‘‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) సెక్షన్ 4 కింద శిక్షార్హమైన నేరం జరిగినట్టు సూచించే ఎలాంటి నేరారోపణ జాడ లేదు. ‘చట్టాన్ని ఘోరంగా దుర్వినియోగం చేయడమే’ అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడిపై పోలీస్‌ ఎఫ్‌ఐఆర్, ఈడీ విచారణను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) 2020లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో క్రిమినల్ నమ్మకద్రోహం, మోసం, క్రిమినల్ కుట్ర, ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లను ప్రస్తావించగా, తదనంతరం ఈడీ తీసుకున్న చర్య మనీలాండరింగ్ ఆరోపణలపై ఆధారపడింది. ఇటీవల బహిరంగపరిచిన ఒక ఉత్తర్వులో… నేరాలకు సంబంధించిన అంశాలు రుజువు కాలేదని పేర్కొంటూ, ఈఓడబ్ల్యూ ఎఫ్‌ఐఆర్‌ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కొట్టివేస్తూ, “ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించడం చట్ట ప్రక్రియను ఘోరంగా దుర్వినియోగం చేయడమే. దీనిని ఈ ఉత్తర్వు ద్వారా కొట్టివేస్తున్నాం” అని స్పష్టం చేశారు. ప్రాథమిక నేరం కింద నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసినందున, ఈ విషయంలో ఈడీ కేసును కూడా మూసివేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నిర్ణీత ప్రాథమిక నేరాన్ని కొట్టివేయడంతో, హైకోర్టు ఈడీ విచారణను కూడా రద్దు చేసింది.

“దాదాపు ఏడాదిన్నర పాటు ఈడీ విస్తృత దర్యాప్తు జరిపినప్పటికీ”, ‘‘పీఎంఎల్‌ఏ సెక్షన్ 4 కింద శిక్షార్హమైన నేరం జరిగినట్టు కనీసం సూచించే ఎలాంటి నేరారోపణ కూడా ఇప్పటివరకు లభించలేదు’’ అని పేర్కొంది. మోసం అనే నేరానికి, ఆస్తిని కోల్పోయి మోసపోయిన బాధితుడు ఉండటం అవసరమని, అయితే ఈ కేసులో అలాంటి వ్యక్తి లేడని హైకోర్టు పేర్కొంది.ఆగస్టు 26, 2020న, ఈఓడబ్ల్యూ ఐపీసీ సెక్షన్లు 406 (నేరపూరిత విశ్వాస భంగానికి శిక్ష), 420 (మోసం , ఆస్తిని అప్పగించేలా మోసపూరితంగా ప్రేరేపించడం), 120బి (నేరపూరిత కుట్రకు శిక్ష) కింద ఒక ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. ప్రబీర్ పుర్కాయస్థ కు చెందిన… డిజిటల్ పోర్టల్‌ను కలిగి ఉన్న పీపీకే న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రయి వేట్ లిమిటెడ్, 2018-19 సంవత్సరంలో దేశంలోని ఎఫ్‌డీఐ నిబంధనలు , ఇతర చట్టాలను ఉల్లంఘించి, అమెరికాకు చెందిన వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూడబ్ల్యూఎం హెచ్) నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్ డీఐ) స్వీకరించిందని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. ఈ ఎఫ్‌డీఐ ద్వారా డబ్ల్యూడబ్ల్యూఎం హెచ్ ప్రబీర్ పుర్కాయస్థ( పీపీకే) న్యూస్‌క్లిక్ స్టూడియోలో 7.69 శాతం వాటాలను పొందింది. డబ్ల్యూడబ్ల్యూఎం హెచ్ నుంచి నిధులు బదిలీ అయిన సమయంలో, డిజిటల్ మీడియాలో ఎఫ్‌డీఐ స్వీకరణపై ఎటువంటి పరిమితి/నియంత్రణ లేదని సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈఓడబ్ల్యూ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, ఈడీ సెప్టెంబర్ 2, 2020న పీఎంఎల్ఏ చట్టం కింద ఫిర్యాదును నమోదు చేసి, ఫిబ్రవరి 2021లో సోదాలు నిర్వహించింది. మోసం , క్రిమినల్ విశ్వాసఘాతానికి సంబంధించిన ఐపీసీ నేరాలు ఏవీ ఇక్కడ రుజువు కాలేదని హైకోర్టు పేర్కొంది. “ఐపీసీ సెక్షన్ 120 బీ కింద నేరం ఇంకా వర్తిస్తుందని ఈడీ వాదించడానికి ప్రయత్నిస్తోందని వారి స్పందన ద్వారా స్పష్టమవుతోంది. అయితే, కేవలం ప్రబీర్ పుర్కాయస్థ , జాసన్ ఫెచర్ (డబ్ల్యూడబ్ల్యూఎం హెచ్ మేనేజర్) ఒక ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తప్ప, క్రిమినల్ కుట్ర ఆరోపణకు గల ఆధారం ఏమిటో వివరించలేదు… సంబంధిత వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన అది క్రిమినల్ కుట్రగా పరిగణించబడదు. దానికి బదులుగా, చట్టవిరుద్ధమైన లక్ష్యం ఏమిటి లేదా అనుసరించిన మార్గాలు ఏమిటి అనేవి ఈడీ నిరూపించగలిగితేనే దానిని క్రిమినల్ కుట్రగా పేర్కొనవచ్చు,” అని క్రిమినల్ చర్యలను కొట్టివేస్తూ జస్టిస్ కృష్ణ వ్యాఖ్యానించారు.

కేసులను కొట్టివేయాలని కోరుతూ, ‘న్యూస్‌క్లిక్’ సంస్థ వాదన ఇలా “ఎఫ్ఐఆర్ ,ఈసీఐఆర్ వాటి ఆధారంగా జరిగిన దర్యాప్తు” అనేది “జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై స్వతంత్ర , నిష్పాక్షికమైన వార్తా కథనాలను అణచివేసే ప్రయత్నం మాత్రమే. అలాగే, పాత్రికేయులతో సహా వివిధ వ్యక్తులపై భయాందోళనలు సృష్టించి, వారి భావప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కును వినియోగించుకోకుండా నిరుత్సాహపరిచే ఉద్దేశంతో ఇవి జరిగాయి.” ఆర్బీఐ కూడా ఎటువంటి అక్రమాలు జరగలేదని గుర్తించిందన్న విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ​నిందితులకు ఈడీ తన ఈసీఐఆర్ కాపీని కూడా అందించలేదు; దీనిపై పుర్కాయస్థ , న్యూస్‌క్లిక్ వేరొక పిటిషన్‌లో అభ్యర్థన కూడా చేశారు. అయితే, ఇప్పుడు ఈడీ చర్యలు కొట్టివేయబడటంతో, ఆ పిటిషన్ నిష్ప్రయోజనమైనదిగా పరిగణించబడి పరిష్కరించబడింది. న్యూస్‌క్లిక్ పైసుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఈడీ ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్, దాని ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించినట్టు అధికారులు గురువారం తెలిపారు. మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు, ప్రాసిక్యూషన్ లేవనెత్తిన అనేక కీలక వాదనలను “విస్మరించిందని లేదా పట్టించుకోలేదని” వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -