రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి :
ఎఫ్‌టీసీసీఐ సమావేశంలో మంత్రి డి శ్రీధర్ బాబు
హైదరాబాద్ : కీలక మౌలిక వసతుల అభివృద్ధి, ప్రగతిశీల విధానాలతో తెలంగాణ దేశంలోనే అత్యంత ఆశాజనకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని రాష్ర్ట పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సదస్సు (ఐసీఎస్‌ఎల్ 2026) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వ్యూహాత్మక మౌలిక వసతుల అభివృద్ధి, ప్రగతిశీల విధానాలతో తెలంగాణ దేశంలోనే అత్యంత ఆశాజనకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని అన్నారు. సరఫరా, డిమాండ్ల మధ్య అత్యల్ప దూరమే లాజిస్టిక్స్ అని, రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయి నప్పటికీ తన భౌగోళిక స్థానాన్ని వ్యూహాత్మక ప్రయోజనంగా మార్చుకుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక గణాంకాలను వెల్లడించారు. దేశ జిడిపిలో తెలంగాణ వాటా దాదాపు 5 శాతంగా ఉండగా.. సరుకుల ఎగుమతుల్లో దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. గడచిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.1.61 లక్షల కోట్లకు పైగా ఎగుమతులను నమోదయ్యాయి. ఎగుమతుల సూచిక -2024లో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాజిస్టిక్స్ పాలసీ 2.0, మనోహరాబాద్ ప్రతిపాదిత మెగా మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ వంటివి రాష్ట్రాన్ని అంతర్జాతీయ హబ్‌గా మారుస్తున్నాయన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్ రవికుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రముఖ హబ్-అండ్-స్పోక్ కేంద్రంగా ఎదగడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయన్నారు. అభివృద్ది చెందుతున్న వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరించడం ద్వారా రాష్ట్రం పూర్తి సామర్థ్యాన్ని అందుకోగలదని సూచించారు. ఎఫ్‌టీసీసీఐ లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులతో నాలుగు కీలక ప్యానెల్ చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మౌలిక వసతుల విస్తరణ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్, ఫ్యూచర్ ఫ్రెయిట్ గ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికత, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి వంటి భవిష్యత్తు అవసరాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. భారతదేశ లాజిస్టిక్స్ పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఈ ప్రారంభ సమావేశంలో పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, జీఎస్టీ అండ్ కస్టమ్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అరుణ్ కుమార్, ఎఫ్‌టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెకె మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కీలక లాజిస్టిక్స్ హబ్‌గా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



