ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో
మంత్రి ఉత్తమ్ భేటీ
ఎన్ఓసీ కోసం ప్రత్యేక చొరవ
ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం
సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లు విడుదల
ముంపు ప్రభావిత భూములకు
చట్టబద్ధ పరిహారం
4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
ఎన్ఓసీ కోసం ప్రత్యేక చొరవ
ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం
సర్వే ఖర్చుల కోసం
రూ.9.883 కోట్లు విడుదల
ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ధ పరిహారం
4.40 లక్షల ఎకరాల
ఆయకట్టు స్థిరీకరణ
రామప్ప–పాకాలతో అదనంగా 30 వేల ఎకరాలకు సాగునీరు
దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ
వందల గ్రామాలకు తాగునీటి ప్రయోజనం : మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు పడింది. గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులూ కలిశారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు.ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం (ఎన్ఓసీ) జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక విజ్ఞాపన పత్రాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నదని ఉత్తమ్ తెలిపారు. సమ్మక్క–సారక్క బ్యారేజ్ తెలంగాణ రైతాంగానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని ఆయన వివరించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారనీ, ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ పరిణామం సమ్మక్క–సారక్క ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని చెప్పారు. ఎన్ఓసీ లేకపోవడం వల్లే డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారన్నారు. మరింత కచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందన్నారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములను గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సమ్మక్క–సారక్క ప్రాజెక్టు మూలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీవీ నరసింహారావు కంఠనపల్లి సుజల స్రవంతి పథకంలో ఉన్నాయని మంత్రి వివరించారు. గోదావరి నదిపై కంఠనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించినట్టు చెప్పరు. 2009 ఫిబ్రవరి పదో తేదీన జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.27 ద్వారా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించిందనీ, 2012 మార్చి రెండున కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారని మంత్రి తెలిపారు. సాంకేతిక అధ్యయ నాల అనంతరం బ్యారేజ్‌ను ములుగు జిల్లాలోని తూపాకులగూడెం వద్ద నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమని తేలిందన్నారు. ఈ మార్పుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని వివరించారు. సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.
అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000 ఎకరాలు, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇదే కాకుండా జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2021 ఆగస్టు 31న కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు మంత్రి తెలిపారు. హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు.
2024 జూలై నుంచి 2026 జనవరి వరకు కేంద్ర జల సంఘం కోరిన వివరణలన్నింటికీ తెలంగాణ నీటిపారుదల శాఖ సమగ్ర సమాధానాలు సమర్పించిందన్నారు. ఎన్ఓసీ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా నిరంతరంగా కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 26, ఆగస్టు 12, 2025 జనవరి 24, ఏప్రిల్ 23 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు రాసినట్టు. 2025 సెప్టెంబర్ 22న రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు చేశారు. అంతే గాకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ తో, కేంద్ర జల సంఘం చైర్మెన్ కూడా ఈ అంశంపై చర్చించినట్టు తెలిపారు. 2025 నవంబర్, డిసెంబర్ నెలల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తులు పంపి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరామన్నారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయడం, ముంపు ప్రభావితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం, రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వల్ల ఎన్ఓసీ త్వరలోనే లభించే అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ డీపీఆర్ తుది పరిశీలన పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంతో సమ్మక్క–సారక్క బ్యారేజ్ అమలుకు ఉన్న చివరి ప్రధాన పరిపాలనా అడ్డంకి కూడా తొలగిపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, అంతర్‌రాష్ట్ర సత్సంబంధాలు ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క–సారక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.



