Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీబీ గ్రామ్‌‌జీ-2025ను రద్దు చేయాలి

వీబీ గ్రామ్‌‌జీ-2025ను రద్దు చేయాలి

- Advertisement -

నరేగాను కొనసాగించాలి
వికలాంగులకు సామాజిక భద్రత సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమం
ఎన్‌‌పీఆర్‌‌డీ కేంద్ర కమిటీ సమావేశంలో తీర్మానం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వీబీ గ్రామ్‌‌జీ-2025ను రద్దు చేయాలనీ, నరేగాను కొనసాగించాలని ఎన్‌‌పీఆర్‌‌డీ డిమాండ్‌ ‌చేసింది. చెన్నైలో ఆ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నంబురాజన్‌ అధ్యక్ష‍తన నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు.ఈ సందర్బంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ ‌మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి అమలు చేస్తున్న వీబీ గ్రామ్‌‌జీ-2025 వల్ల గ్రామీణ ప్రాంతంల్లో ఉన్న వికలాంగుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. వారిలో నిరుద్యోగం, పేదరికం నిర్ములన కోసం నరేగా చట్టం 2006 నుండి ఉపయోగపడిందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వికలాంగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నరేగా సంఘర్షణ మోర్చాతో కలిసి వీబీ గ్రామ్‌‌జీ-2025 రద్దు కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేపడతామని హేచ్చరించారు.

మతపరమైన హింస దేశంలో అంగవైకల్యం పెరగడానికి దోహదపడుతుందని చెప్పారు. ట్రాన్స్ జెండర్స్ చట్టానికి కేంద్రం చేసిన సవరణలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. వికలాంగుల హక్కుల చట్టంలోని నిబంధనలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎస్ఐఆర్ ప్రభావం వికలాంగులపై తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదమని తెలిపారు. ఓటర్ల జాబితా నుండి వికలాంగుల ఓట్లను తొలగించే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని గుర్తు చేశారు. లేబర్ కొడ్‌ ‌ల రద్దు కోసం కార్మికులు చేస్తున్న పోరాటాలకు సంఘీభావంగా నిలబడుతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌ ‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ చేయడం ద్వారా వికలాంగులు పొందే రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదముందని, ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అర్భాటంగా ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం కేంద్ర ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప వికలాంగులకు ఉపయోగపడడం లేదని తెలిపారు. సామూహిక ప్రాంతాలు వికలాంగులు వినియోగించుకునే విదంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని పేర్కొన్నారు. రైల్వేలలో వికలాంగులకు సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు. వికలాంగులకు అంత్యోదయ అన్నాయోజన కార్డులు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వికలాంగుల పలు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేయాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఎన్‌‌పీఆర్‌‌డీ జాతీయ అధ్యక్షులు గిరీష్ కీర్తి, ఉపాధ్యక్షులు ఎం అడివయ్య, జాన్సీరాణి, సహాయ కార్యదర్శులు రిషికేష్, కోశాధికారి చక్రవర్తి కమిటీ సభ్యులు కె వెంకట్, ఆర్ వెంకటేష్, జె రాజు, రంగప్ప, మోహనన్, విల్సన్, రాజన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -