Sunday, June 14, 2026
E-PAPER
Homeసమీక్షకురుమలపై వచ్చిన తొలి పరిశోధనా గ్రంథం

కురుమలపై వచ్చిన తొలి పరిశోధనా గ్రంథం

- Advertisement -

ఉద్యమాల కోసమో, రాజకీయాల కోసమో గొల్లకురుమల ఐక్యత అంటూ సభలు పెడతారు. కానీ వారిద్దరూ ఒకటి కాదు. వారిద్దరి మధ్య కంచం పొత్తు, మంచం పొత్తు ఉండదు. వారి మధ్య మిత్ర వైరుధ్యాల కన్నా శత్రు వైరుధ్యాలే ఎక్కువ. వాళ్లను ఎలా గుర్తించాలంటే బర్లు కాసే వాళ్లు గొల్లలు, గొర్లు కాసే వాళ్లు కురుమలని బండ గుర్తు. వాళ్ళు వీరి పనులు, వీరు వారి పనులు చేయడం అక్కడక్కడ కనిపించినా అది చాలా అరుదు. అందుకే ప్రభుత్వం వారు బీసీ బి కేటగిరీలో కురుమలను చేరిస్తే, బీసీడీలుగా గొల్లలను గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కురుమలు నివసిస్తున్నప్పటికీ, రాయలసీమలో వారి సంఖ్య ఎక్కువ. అందుకే అక్కడి నుండి కురుమల మీద కథలు, నవలలు ఎక్కువగా వచ్చాయి. చెదురుమదురుగా తెలంగాణలో కూడా కథలు వచ్చినప్పటికీ, మొదటిసారిగా గొల్ల కురుమల కథలను సేకరించి ‘గొంగడి’ పేరుతో ఒక సంకలనాన్ని బర్ల మహేందర్‌ తీసుకురావడం అభినందించదగ్గ విషయం. అలాగే తెలుగులో మొదటిసారిగా ‘కురుమల చరిత్ర – సంస్కతి’ ల మీద పరిశోధన చేసిన ఘనత కూడా బర్ల మహేందర్‌ కే దక్కుతుంది. వీరి ‘కురుమల సాహిత్యం- చరిత్ర: సంస్కృతి’ అనే ఈ పిహెచ్డి గ్రంథంలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మొదటి అధ్యాయం ‘కురుమల పరిచయం – పుట్టుపూర్వోత్తరాలు’లో జాతి కులం, తెగలను నిర్వచిస్తూ- వాటి నేపథ్యంలో కురుమల పరిచయం చేశారు. రెండవ అధ్యాయం ‘కురుమల సంస్కృతి: ఆచారాలు- సంప్రదాయాలు’లో పుట్టుక ,పెళ్లి, జీవనం, చావు వరకు వారి జీవితాలలో అనుసరించే నమ్మకాలు, సంప్రదాయాలను తెలియజేశారు. మూడవ అధ్యాయంలో జానపద కళలను పరిచయం చేస్తూ, కురుమల ప్రధానమైన జానపద కళారూపం ఒగ్గు కథ అంటూ ఈ ఒగ్గు పుట్టుక, చారిత్రిక నేపథ్యం, వాద్యాల గురించి వివరించారు. నాల్గవ అధ్యాయం ‘కురుమల సాహిత్యం: పాట -కవిత్వం’ ఇందులో కురుమల పాటలు, కవిత్వాలలోని సాహిత్యాన్ని ప్రధానంగా చర్చించారు. ఐదవ అధ్యాయం ‘కురుమల సాహిత్యం: కథ -నవల’. ఇందులో కురుమల కథ, నవలా సాహిత్యాలలోని కురుమల జీవన విధానం, సంస్కృతి, కట్టుబాట్లు, రాజకీయ చారిత్రిక విషయాలను, కురుమల ఆశ్రిత కులాల జీవన విధానాన్ని, బ్రాహ్మణ ఆదిపత్యాన్ని, దొరల ఆధిపత్యం- కురుమల తిరుగుబాటును, ఒగ్గు కథ- ప్రపంచీకరణ ప్రభావం మొదలైన అంశాలను విశ్లేషించారు. ఆరవ అధ్యాయం ‘కురుమల సాహిత్యము- భాషాంశాలు’లో కురుమల సాహిత్యంలో వచ్చిన మాండలిక పదాలను, వాటి అర్థాలను ఆకారాది క్రమంలో కూర్చోడం జరిగింది. ఈ పదజాలం తెలుగు నిఘంటువును మరింత పరిపుష్టం చేయడానికి ఉపకరిస్తుంది. ఆచార్య సూర్యా ధనుంజరు పర్యవేక్షణలో రూపొందిన ఈ పరిశోధనా గ్రంథం సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా రూపొందింది. ఈ చారిత్రక గ్రంథాన్ని నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ముద్రించింది.

కె.పి.అశోక్‌
కుమార్‌
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -