సమస్యాత్మక ప్రాంతాలకు టీమ్లను ముందుగా పంపండి
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో హై అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరి తో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో టీములను ముందస్తుగా మోహరించాలని సీఎం సూచించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. శంషాబాద్ వద్ద బెంగళూరు హైవేపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత సిబ్బంది.. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. షాద్నగర్లోనూ జాతీయ రహదారిపై భారీగా వరద నిలిచింది.



