Sunday, June 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు‌బడుల మూతపై బలమైన ఉద్యమం

‌బడుల మూతపై బలమైన ఉద్యమం

- Advertisement -

4‌ వేల స్కూళ్లే చాలని సీఎం అనడం రాజ్యాంగ విరుద్ధం
ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
లేదంటే కాంగ్రెస్‌ సర్కారును గద్దెదించడానికైనా వెనుకాడం
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
20 శాతం నిధులు కేటాయించాలి : తెలంగాణ విద్యా
పరిరక్ష‍ణ కమిటీ రౌండ్‌‌టేబుల్‌‌లో వక్తల డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలు అవసరం లేదనీ, వాటిని నాలుగు వేల పాఠశాలలకు తగ్గిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు ఖండించారు. ఈ వ్యాఖ్యలు అప్రజాస్వామికమనీ, రాజ్యాంగ విరుద్ధమని వారు విమర్శించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దెదించడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. సీఎం తీరు మారకుంటే బడుల మూసివేతకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులను పోరాటంలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. దీనిపై రాహుల్‌‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయాలని అన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ విద్యా పరిరక్ష‍ణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ ‌ప్రెస్‌‌క్లబ్‌‌లో రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అందరికీ విద్యావైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కానీ అవి వ్యాపారమయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలే వ్యాపారంగా మారాయని వివరించారు.

రాష్ట్రంలో 11 వేల ప్రయివేటు పాఠశాలల్లో 66 శాతం మంది విద్యార్థులు చదువుతుంటే 27 వేల ప్రభుత్వ బడుల్లో 34 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. సర్కారు బడుల్లో పిల్లలు చేరకపోవడానికీ, ప్రయివేటు పాఠశాలల్లో చేరడానికి పాలకులు అనుసరించిన విధానాలే కారణమని విమర్శించారు. ప్రభుత్వ బడులకు నిధులు కేటాయించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ప్రయివేటు విద్యారంగాన్ని పాలకులు ప్రోత్సహిస్తున్నారనీ, వాటిపై ఎలాంటి నియంత్రణ లేదని చెప్పారు. విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చట్టసభల్లో సగం మంది ప్రజాప్రతినిధులు విద్యావైద్యం వ్యాపారం చేసే వారే ఉన్నారని వివరించారు. విద్యాకమిషన్‌ ‌సిఫారసుల ప్రకారం విద్యకు 18 శాతం నిధులను కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. బడుల సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు సీఎం రేవంత్‌‌రెడ్డికి లేఖ రాయాలని సూచించారు. టీజేఎస్‌ అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ బడుల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరారు. అల్పాహారం పథకం మంచి నిర్ణయమని అన్నారు. బడుల మూసివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం :తెలంగాణ విద్యా పరిరక్ష‍ణ కమిటీ ప్రధాన కార్యదర్శి హరగోపాల్‌
‌విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలంగాణ విద్యా పరిరక్ష‍ణ కమిటీ ప్రధాన కార్యదర్శి హరగోపాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులను నాలుగు వేలకు తగ్గిస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ప్రస్తుత పాలకుల కంటే పాత వారే మంచి వారన్న పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఎన్‌ఈపీని అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అని అన్నారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ సమాజం అభివృద్ధి చెందబోదని చెప్పారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలిపారు. పాఠశాలలు మూసి, జ్ఞానాన్ని అందించకుండా ప్రధాని మోడీ విశ్వగురు ఎలా అవుతారని ప్రశ్నించారు. స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్‌ ‌రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాజ్యాంగ పరిరక్ష‍ణకూ 
పోరాడాల్సిన దుస్థితి : మాడభూషి శ్రీధర్‌
23 వేల పాఠశాలలను ‌మూసివేస్తామని ‌సీఎం ప్రకటన చేయడం రాజ్యాంగానికి, విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్ అన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా పరిరక్షణతోపాటు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందని తెలిపారు. ప్రొఫెసర్‌ డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ సి‌టీ కాదనీ, ఫ్యూచర్ పౌరులను తయారు చేయాలని కోరారు. విద్యాశాఖను గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఏకపక్షంగా పాఠశాలలను మూసివేస్తామని ప్రకటన చేయడం వాంఛనీయం కాదన్నారు. భవిష్యత్తులో విద్యా పరిరక్షణ కోసం ఉద్యమించాలనీ, తాము మద్దతిస్తామని అన్నారు. సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌ ‌మాట్లాడుతూ బడుల మూసివేతపై సీఎం రేవంత్‌‌రెడ్డికి ప్రతిపాదన ఉంటే మేధావులు, విద్యావేత్తలతోపాటు వామపక్ష‍ పార్టీలతో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. సీపీఐ(ఎంఎల్‌) ‌న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌ ‌మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రభుత్వ బడి ఉండాలన్నారు. టీఎస్‌‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ ప్రభుత్వ బడులను మూసివేస్తామని విద్యామంత్రి, ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మాట్లాడ్డం సరైంది కాదన్నారు.


దానివల్ల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్టీయూటీఎస్‌ అధ్యక్ష‍ులు జి సదానందంగౌడ్‌ ‌మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్‌‌కు ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల ఉండాలని చెప్పారు. బడుల మూసివేతపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. ఏకపక్ష‍ంగా ముందుకెళ్తే ఉద్యమించాలని అన్నారు. అధ్యక్షత వహించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కె చక్రధరరావు మాట్లాడుతూ విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేసి అందరికీ నాణ్యమైన, సమానమైన ఉచిత విద్యను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు. విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహణ కార్యదర్శి కె లక్ష్మినారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 నుంచి వచ్చేనెల 15 వరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ మెమోరాండాలను సమర్పించాలని చెప్పారు.


అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, డీబీఎఫ్ నాయకులు శంకర్, విద్యావంతుల వేదిక నాయకులు అంబటి నాగయ్య, ఎంవీఎఫ్ నాయకులు వెంకట్ రెడ్డి, ప్రొఫెసర్లు సూరెపల్లి సుజాత, భవాని, విజయ్, వినాయక్‌రెడ్డి, అన్వర్‌ఖాన్, వనమాల, టీపీజేఏసీ రాష్ట్ర కో`కన్వినర్ కన్నెగంటి రవి, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి, విద్యా పరిరక్షణ కమిటి సహాధ్యక్షులు వై అశోక్ కుమార్, సహ ప్రధాన కార్యదర్శి ఎం రఘుశంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎంఎన్ కిష్టప్ప, కె వేణుగోపాల్, కార్యదర్శి రవిచంద్ర, విద్యార్థి సంఘాల నాయకులు నాగరాజు, పుట్ట లక్ష్మణ్, పవన్, మురళీ, కృష్ణ, మహేష్, పాలమూరు అధ్యయన వేదిక ఎం రాఘవచారి, బి కొండల్ రెడ్డి, రేణుక, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -