Sunday, June 14, 2026
E-PAPER
Homeజాతీయంఎందుకీ లొంగుబాటు ధోరణి?

ఎందుకీ లొంగుబాటు ధోరణి?

- Advertisement -

అమెరికా దాడిలో భారత నావికులు చనిపోయినా నోరు మెదపని ప్రధాని
ఖండన ప్రకటనతో సరిపెట్టిన విదేశాంగ శాఖ…ఇరాన్‌పై నెపం మోపిన ట్రంప్‌

న్యూఢిల్లీ : ఒమన్‌ సమీపంలో ఎంటీ మారివెక్స్‌, ఎంటీ సెట్టిబెల్లో, ఎంటీ జెల్‌వీర్‌ నౌకలపై అమెరికా సేనలు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ మూడింటిలోనూ మన దేశానికి చెందిన నావికులే ఉన్నారు. ఎంటీ సెట్టిబెల్లోపై జరిగిన దాడిలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాతో భారత్‌ సంబంధాల విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఈ దాడులు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భారత్‌ నిరసన వ్యక్తం చేసినప్పటికీ మన నావికులతో నడుస్తున్న వాణిజ్య నౌకలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది. దాడుల పైన, భారత నావికుల మరణం పైన అమెరికా సైన్యం కానీ, ట్రంప్‌ ప్రభుత్వం కానీ విచారం వ్యక్తం చేసిన పాపాన పోలేదు. భారత నావికులను అమెరికా సేనలు పొట్టనపెట్టుకోవడాన్ని ప్రధాని మోడీ కానీ, ఆయన మంత్రిమండలి సహచరులు కానీ ఖండించలేదు. విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది కానీ అందులో దాడికి పాల్పడిన వారి పేరును ప్రస్తావిం చకుండా జాగ్రత్త పడింది. ‘మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలకు ఈ దాడులు ప్రత్యక్ష ఫలితం’ అంటూ తేలికగా తీసుకుంది.

రాజ్యాంగ బాధ్యతల ఉల్లంఘనే
భారత నావికుల మృతిపై నౌకాయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసి చేతులు దులుపుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే మన రాజకీయ నాయకత్వం అమెరికాకు వ్యూహాత్మకంగా లంగిపోయినట్లు కన్పిస్తోంది. అమెరికా దాడిలో మరణించిన ముగ్గురు భారతీయ నావికుల మృతదేహాలను వెలికితీస్తున్న సమయంలోనే…ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని మైలురాయిని అధిగమించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా మోడీ కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా సైనిక దాడులపై మోడీ ప్రభుత్వ మౌనాన్ని చూస్తుంటే దేశ పౌరుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యతను అది విస్మరించిందని అర్థమవుతోంది. అంతర్జాతీయ జలాలలో అమెరికా బలగాలు అమాయక భారతీయులను చంపుతున్నప్పుడు ప్రధాని మౌనం వహించడమంటే ఆయన తన రా జ్యాంగ బాధ్యతలను ఉల్లంఘించినట్లే అవుతుంది.

నిరసన తెలిపినా ఆగని దాడులు
భారత విదేశాంగ శాఖ కార్యాలయం న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ దౌత్యవేత్త జాసన్‌ మీక్స్‌ను పిలిపించింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం ప్రాణాంతక దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దాడులకు సంబంధించి అమెరికా దౌత్యవేత్తను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించడం ఈ వారంలో ఇది రెండోసారి. కాగా అదనపు కార్యద ర్శి నాగరాజ్‌ నాయుడు భారత్‌ తరఫున లాంఛనం గా నిరసనను నమోదు చేసి మన పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ దౌత్యపరమైన చర్య అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ తర్వాతే అమెరికా సేనలు ఎంటీ జల్‌వీర్‌పై దాడి చేశాయి. ఈ నౌకలోని 20 మంది సిబ్బంది భారతీయులే. వారంతా సురక్షితంగానే ఉన్నారని మోడీ ప్రభుత్వం తెలిపింది.

దాడి చేసింది ఇరానే : ట్రంప్‌ ముక్తాయింపు
ఒమన్‌ తీరంలో భారత నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది ఇరాన్‌ సేనలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించారు. అయితే ఈ దాడులు చేసింది తామేనని అమెరికా సైనిక కమాండ్‌ (సెంట్‌కామ్‌) అంతకుముందు స్వయంగా ప్రకటించింది. తమ నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకే దాడి చేశామని చెప్పింది. అమెరికా సైన్యం శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ హార్ముజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు ఇరాన్‌ దళాలు ప్రయత్నించాయని ఆరోపించింది. ఇరాన్‌ ప్రయోగించిన అనేక డ్రోన్లను అమెరికా నౌకాదళం అడ్డుకొని కూల్చివేసిందని, జలసంధిలో నౌకాయానం సజావుగా సాగుతోందని సెంట్‌కామ్‌ చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా భారత వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు నావికులు మరణించినప్పటికీ ప్రధాని మోడీ పల్లెత్తు మాట అనలేదని, అమెరికాతో ఆయన రాజీ పడ్డారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. భరతమాత బిడ్డలను పొట్టనపెట్టుకున్న వారిపై ఆగ్రహించే ధైర్యం కానీ, శక్తి కానీ ప్రధానికి లేవని ఎద్దేవా చేశారు.

ప్రకటనతో సరి
ఎంటీ సెట్టిబెల్లో నౌకపై జరిగిన దాడి గురించి మాత్రం విదేశాంగ శాఖ ఓ సంక్షిప్త అధికార ప్రకటన విడుదల చేసింది. ‘సెట్టిబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఖండిస్తున్నాం. నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మందిని రక్షించారు. మిగిలిన ముగ్గురు నావికులు గల్లంతయ్యారని సమాచారం’. గల్లంతైన నావికులు ముగ్గురు మరణించారని ఆ తర్వాత నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్‌ ధృవీకరించారు. అమెరికా జరిపిన క్షిపణి దాడిలో నౌక ఇంజిన్‌ గది దెబ్బతిని వారు ప్రాణాలు కోల్పోయారు. సెట్టిబెల్లోపై దాడి జరగడానికి 24 గంటల ముందు 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌక ఎంటీ మారివెక్స్‌పై దాడి జరిగింది. అయితే అది భారత పతాకం ఉన్న నౌక కాదని, అందుకే ప్రభుత్వం స్పందించలేదని అధికార వర్గాలు తెలిపాయి. కానీ ఈ దాడికి అమెరికాయే కారణమని చెప్పడానికి సర్కారు వెనుకంజ వేసింది.

పరోక్ష సమర్ధనలు
దేశానికి బలమైన నాయకత్వాన్ని అందిస్తామని చెప్పుకుంటున్న మోడీ గొప్పలను ఈ దాడులు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాక భారత వ్యూహాత్మక సార్వభౌమత్వ సూత్రానికి జరిగిన ద్రోహాన్ని కూడా బయటపెడుతున్నాయి. భాగస్వామ్య హోదాతో నిమిత్తం లేకుండా తన పౌరులకు హాని జరిగినప్పుడు భారత్‌ స్వతంత్రంగా వ్యవహరించాలని ఈ సూత్రం చెబుతోంది. అమెరికా మనకు వ్యూహాత్మక భాగస్వామి. కానీ ఓ వ్యూహాత్మక భాగస్వామ్య దేశం మన పౌరులను పొట్టన పెట్టుకుంటున్నప్పుడు దానిని బహిరంగంగా ఖండించాలి. అలా చేయడంలో భారత్‌ విఫలమైంది. ఈ దాడులపై మోడీ ప్రభుత్వం ఏం చెబుతోంది? ‘రెండు నౌకలపై ఆంక్షలు ఉన్నాయి. వాటిలో ఒకటి నిబంధనలను పాటించలేదు’…ఇలా చెప్పడం ద్వారా అమెరికా చర్యను పరోక్షంగా సమర్ధించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దాడికి గురైన మూడు నౌకలు భారతీయులకు చెందినవి కావని, వాటిపై విదేశీ పతాకాలు (పలావూ లేదా గినియా-బిస్సావూ జెండాలు) ఉన్నాయని అంటూ సాంకేతిక అంశాలను తెర పైకి తెచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -