సెకండ్ ఆఫ్‌పై ఆశ లేదు
సీఎం రేవంత్‌రెడ్డికి
డైలాగ్‌లు ఎక్కువ.. పని తక్కువ
మళ్లీ కేసీఆర్ నాయకత్వమే
రాష్ట్రానికి అవసరం :
సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార సినిమా ఫస్ట్ అఫ్ పూర్తిగా ఫెయిల్ అయింది.. సెకండ్ ఆఫ్ పై ప్రజలకు ఆశ లేదు.. మళ్లీ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో, వేములవాడ పట్టణంలో శనివారం నియోజకవర్గస్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్య క్రమాలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సినిమా ఫస్ట్ హాఫ్ డిజాస్టర్ అయినప్పుడు సెకండ్ హాఫ్ పట్ల ప్రేక్షకుల్లో నిరాశ ఎలా ఉంటుందో.. ఈ ప్రభుత్వ పనితీరు కూడా అలాగే ఉందన్నారు. అమ్మ విలువ, అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని, ఇప్పుడు ప్రజలు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ‘తరుగు’ పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తోందని, ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ పాత రోజుల మాదిరిగా క్యూల్లో నిలబడే దుస్థితి వచ్చిందని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, రాహుల్ గాంధీకి మాత్రం సంచుల సంచులు డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ముందు బాండ్ పేపర్ పై రాసిచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని, దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని, ఆయనకు డైలాగులు ఎక్కువ-పని తక్కువ అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించిన వ్యక్తి రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వదిలి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారని వ్యాఖ్యానిం చారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆరేనని, మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. “నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది సిరిసిల్ల ప్రజలే” అని కేటీఆర్ భావోద్వేగం తో చెప్పారు. రూపాయి పంచకుండా, చుక్క మద్యం పంచకుండా ప్రజల ఆశీర్వాదంతో గెలిచినందుకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని తెలిపారు. కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లను కేసీఆర్ నాయకత్వంలో జిల్లాగా మార్చి రూపురేఖలు మార్చామని చెప్పారు. ఈ నెల 25 తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్నీ స్వయంగా సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటా నని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, కొండూరి రవీందర్ రావు, తుల ఉమా, తోట ఆగయ్య, న్యాలకొండ అరుణ, జిందం కళ జిందం చక్రపాణి, చీటీ నర్సింగారావు, గూడూరి ప్రవీణ్, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ మున్సిపల్ చైర్మెన్ రామతీర్థపు మాధవి, ఏనుగు మనోహర్ రెడ్డి, గజానంద రావు పాల్గొన్నారు.



