Sunday, June 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆప్షన్ ఉన్నా 'కోఆప్షన్' సున్నా..!

ఆప్షన్ ఉన్నా ‘కోఆప్షన్’ సున్నా..!

- Advertisement -

రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో భర్తీకాని కో- ఆప్షన్ సభ్యులు
పాలకవర్గం ఎన్నికయ్యాక 45 రోజుల్లో చేయాల్సిన ప్రక్రియ
వందలాది మంది ఆశావహుల ఎదురుచూపు
అధికారపార్టీకి దక్కిన అత్యధిక మున్సిపాలిటీల్లోనే జరగని ఎన్నిక
మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కొత్తగూడెం కార్పొరేషన్, ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లోనూ భర్తీకాని సభ్యులు

​నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కౌన్సిలర్లతో సమాన హోదా ఉండే కో-ఆప్షన్ పదవుల భర్తీ కోసం ఆశావహులకు ఎదురు చూపులు తప్పడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి పాలకవర్గం ఏర్పాటైన తర్వాత 45 రోజుల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ వంద రోజులకు పైగా అయినా రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్‌‌తో పాటు సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాలూ ఏర్పాటయ్యాయి. కానీ ఇప్పటికీ ఇల్లందు, అశ్వారావుపేట మినహా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించకపోవడంపై ఆశావహుల్లో నైరాష్యం నెలకొంది. వారంతా మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థల (కార్పొరేషన్లు) పరిధిలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్ అత్యధికంగా 64 మున్సిపాలిటీలను దక్కించుకుంది. రామగుండం కార్పొరేషన్‌తోపాటు మంథని, నల్లగొండ, మంచిర్యాల, అలంపూర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీల్లో గెలిచింది. కాంగ్రెస్ గెలుచుకున్న అత్యధిక మున్సిపాలిటీల్లో కోఆప్షన్ ఎన్నిక జరగకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నా కోఆప్షన్ ఎన్నికలు నిర్వహించటం లేదని కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడిస్తు న్నారు. పాత- కొత్త కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం చేయలేకే అనేకచోట్ల కోఆప్షన్ ఎన్నిక నిర్వహించటం లేదని తెలుస్తోంది.

పదుల సంఖ్యలో ఆశావహులు
మున్సిపాలిటీ చట్టం ప్రకారం నోటిఫికేషన్ జారీ కాగానే కో-ఆప్షన్ పదవులను భర్తీ చేస్తారు. దాదాపు ఒక్కో మున్సిపాలిటీలో పది మందికి పైగా ఆశావహులు ఉన్నారు. వీరంతా మూడు, నాలుగు నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలను కలుస్తూ కో ఆప్షన్ పదవిని తనకు కేటాయించాలని కోరుతున్నారు. దీనికి తోడు ఇటీవల బాధ్యతలను చేపట్టిన మున్సిపల్ చైర్మెన్లు, వైస్ చైర్మెన్లను కలిసి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రతి మున్సిపాలిటీలోనూ నలుగురు ఉండగా.. ఈసారి కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

కౌన్సిలర్లతో సమాన హోదా
కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి కౌన్సిలర్లతోపాటు సమానంగా హోదా, అధికారాలు ఉంటాయి. గౌరవ వేతనం కూడా లభిస్తుంది. మున్సిపల్ సమావేశాలకు హాజరయ్యేందుకు వీరికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సమాజంలో తగిన ప్రాతినిథ్యం లేని మైనారిటీలకు భాగస్వామ్యం చేసేందుకు ఈ పదవులను కట్టబెడతారు. వీరి ఎంపికకు మున్సిపాలిటీ పాలకవర్గం కొలువు దీరిన, తొలి సమావేశం నిర్వహించిన 45 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ చాలా చోట్ల ఇవి పెండింగ్ లో ఉన్నాయి.

ఓడిన అభ్యర్థులూ ప్రయత్నాలు
కౌన్సిలర్ గా పోటీ చేసి.. అత్యధికంగా ఖర్చు పెట్టిన వారు కనీసం కో-ఆప్షన్ పదవినైనా దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పైరవీలు మొదలు పెట్టారు. గతంలో టికెట్లు రానివారు పోటీ నుంచి విరమించుకుంటే కో-ఆప్షన్ పదవి ఇస్తామని కొన్ని చోట్ల నేతలు బుజ్జగించిన విషయం తెలిసిందే. వారంతా ఇప్పుడు కోఆప్షన్ పదవి ఆశిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో నలుగురు సభ్యులను నియమించిన పక్షంలో వారిలో పరిపాలన అనుభవం కలిగిన వారికి రెండు పోస్టులు.. ఇందులో రెండు మహిళలకు కేటాయిస్తారు. కో-ఆప్షన్ సభ్యుడి పోస్టుకు దరఖాస్తు చేసేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిష్టర్ అయి ఉండటంతోపాటు 21 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఒక పోస్టును మహిళకు రిజర్వు చేసే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -