కాంగ్రెస్ అమ్ముడుపోయింది..!
డబ్బులిచ్చి,
పక్కలేస్తే పదవులు
షబ్బీర్‌అలీ పాత ఆడియో కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్
ఏడాది తర్వాత లీక్ కావడం వెనుక ఎవరి హస్తం ఉందో..?
షబ్బీర్ అలీకి నోటీస్ పంపిన టీపీసీసీ
నవతెలంగాణ-
నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ పోరు తారాస్థాయికి చేరింది. షబ్బీర్‌అలీ వర్సెస్ చంద్రశేఖర్‌రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇది వరకే ఇరు గ్రూపులు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. తాజాగా షబ్బీర్ అలీ ఓ నాయకుడితో మాట్లాడిన పాత కాల్ రికార్డు లీక్ కావడం కలకలం రేపుతోంది. పార్టీ పదవి తనకు దక్కకపోవడంపై ఓ కార్యకర్త ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేయగా.. షబ్బీర్‌అలీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘డబ్బులు ఇచ్చి పక్కలేస్తే పదవులు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిన పార్టీగా మారిందంటూ’ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హార్ట్టాపిక్గా మారాయి. అయితే ఏడాది కిందట మాట్లాడిన మాటల కాల్ రికార్డు.. తాజాగా లీక్ కావడం గమనార్హం. కాల్ రికార్డు లీక్ వెనుక ఎవరి హస్తం ఉందో అన్న చర్చ నడుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీకి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఓటమికి షబ్బీర్ అలీనే ప్రధాన కారణమంటూ గతంలో ఆరోపణలు వచ్చిన విషయం విధితమే. ఆయన అనుచరులు ప్రచారంలో అంటీముట్టనట్టు వ్యవహరించడంతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్టు పార్టీలో సైతం చర్చ జరిగింది. కాగా, అప్పుడు ప్రచార బాధ్యతలు చూసేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అండగా ఉంటూ వచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి బరిలో దిగగా.. షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ టికెట్ కేటాయించారు. రెండు చోట్లా ఇద్దరూ ఓటమిపాలయ్యారు. రేవంత్ తరఫున ప్రచారం చేసేందుకు షబ్బీర్ గ్రూపు అంతగా ఆసక్తి చూపలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఏడాది కిందటి రికార్డు.. తాజాగా లీక్
చంద్రశేఖర్‌రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోస్టు వరించడంతో ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడాది కిందట షబ్బీర్‌కు ఫోన్ చేసిన సంభాషణ తాజాగా లీక్ కావడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ పదవి కట్టబెట్టేందుకు రూ.4కోట్లు షబ్బీర్‌అలీ తీసుకున్నట్టు చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఇటీవల ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక చర్యలు తీసుకోవడమే తరువాయి అన్న తరుణంలో షబ్బీర్ ఆడియో కాల్ రికార్డింగ్ లీక్ కావడం గమనార్హం.
ఎస్పీకి ఫిర్యాదులు
కాల్ రికార్డింగ్ ప్రస్తుతం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న షబ్బీర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ ఎస్పీ రాజేశ్‌చంద్రకు ఫిర్యాదు చేశారు. కాగా, ఫేక్ కాల్ రికార్డింగ్ క్రియేట్ చేసి షేర్ చేస్తూ షబ్బీర్‌అలీ రాజకీయ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు కార్యకర్తలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీస్
కాల్ రికార్డింగ్ వ్యవహరంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయినట్టు సమాచారం. ఫోన్ కాల్ సంభాషణ పట్ల వివరణ ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
మాటలు.. మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



