Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రకటనను 
సీఎం ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రకటనను 
సీఎం ఉపసంహరించుకోవాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-సీపీఐ(ఎం)

రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేల పాఠశాలలకు కుదిస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆవాసాలకు సమీపంలోనే పాఠశాల అందుబాటులో ఉండాలని, ఈబాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని విద్యా హక్కు చట్టం-2009లో ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు గ్రామీణ, పేద, దళిత, గిరిజన పిల్లల ప్రాథమిక విద్యా హక్కును కాలరాసే విధంగా ఉందని విమర్శించారు. దశాబ్దాలుగా తండాలు, గూడాలు, పల్లెల్లో నడుస్తున్న బడులను మూసివేస్తే డ్రాపౌట్ రేటు పెరిగి పిల్లలు చదువులకు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. అధికారంలోకి రాకముందు విద్యకు బడ్జెట్‌‌లో 15 శాతం కేటాయించి ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక ఇలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. బడ్జెట్‌లో కనీసం 8.2 శాతం నిధులు కూడా కేటాయించలేదని ఎత్తిచూపారు. బడుల్లో మౌలిక వసతులు లేవనీ, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని పేర్కొన్నారు. మూసివేత ప్రకటన వెనుక కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే ఆలోచన ఉన్నట్టు ఉందని విమర్శించారు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల వుండే విధంగా ప్రజలకు నమ్మకం కల్గించి, ఎన్‌రోల్ పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ​

​ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజుల పెంపు భారం తగదు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును రూ. 200 నుంచి రూ. 1,000 వరకు పెంచడాన్ని జాన్‌‌వెస్లీ తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ స్పందించి ఈ ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. నోటిఫికేషన్లు లేక ఆర్థిక ఇబ్బందులతో పరీక్ష‍లకు యువత సన్నద్ధమవుతున్నదనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును ఐదింతలు పెంచడం దారుణమని పేర్కొన్నారు. ఇది నిరుద్యోగులపై మోయలేని భారాన్ని మోపడమేనని తెలిపారు. తక్షణమే పెంచిన దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును ఉపసంహరించుకుని పాత ఫీజు విధానాన్ని పునరుద్ధరించాలనీ, ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -