Wednesday, June 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏసీబీకి చిక్కిన మరో అవినీతి అనకొండ

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అనకొండ

- Advertisement -

డిప్యూటీ డైరెక్టర్ ఆస్తులు రూ.200 కోట్ల పైనే
ఇంకా రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందన్న ఏసీబీ డీజీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరో అవినీతి అనకొండ ఏసీబీకి చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలకు పైనే అక్రమాస్తులను ఈ అవినీతి డిప్యూటీ డైరెక్టర్ అక్రమాస్తులు గడించినట్టు ఏసీబీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగానికి చెందిన మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి చెందిన ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆక్మసికంగా దాడి చేశారు. ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా వివరాల ప్రకారం ఇటివలన వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన కొందరు అవినీతి అధికారుల బాగోతాలను ఏసీబీ తవ్వుతున్నది. అందులో భాగంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం మల్టీ జోన్ 2 కు చెందిన డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో డీజీ చారు సిన్హా ఆరుగురు డీఎస్పీల నేతృత్వంలో 11 ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. నారాయణగూడ, ఛత్రినాక, గచ్చిబౌలి, మియాపూర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నరహరి తో పాటు అతని స్నేహితులు, బంధువులు బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలను నిర్వహించారు.

ఈ సోదాల్లో విస్మయం కలిగించే రీతిలో కోట్ల రూపాయల నగదు, బ్యాంకు బ్యాలెన్స్, బంగారు వెండి నగలు, విలువైన భూమి పత్రాలు, ఫ్లాట్లను నరహరి కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరం లో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్ర నగర్ లలో మూడు బహుళ అంతస్తుల భవనాలు, గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓల కాలనీ లో జీ +3 భవనాన్ని నరహరి కలిగి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఛత్రినాక లో రెండు అంతస్తుల ఇల్లును కూడా కలిగి ఉన్నట్టు కనుగొంది. నరహరి నివాసంలో కోటీ 50 లక్షల రూపాయల నగదుతో పాటు రూ.2.29 కోట్ల రూపాయల గల పాస్ బుక్కులు, రూ.5.04 కోట్లు గల బ్యాంకు డిపాజిట్ పత్రాలు కూడా ఏసీబీకి చిక్కాయి. దీనితో పాటు 1.3 కిలోల బంగారు నగలు, 8 కిలోల వెండి ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. అలాగే రెండు విలువైన ఆధునిక కార్లు కూడా నరహరి కలిగి ఉన్నట్టు కూడా ఏసీబీ సోదాల్లో తేలింది. బైట పడ్డ నరహరి స్థిర చరాస్తుల విలువ రూ. 13,05,67,100 కోట్ల రూపాయలుగా అధికారులు తేల్చారు. అయితే వీటి బహిరంగ మార్కెట్ విలువ రూపాయలు రెండు వందల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయనీ, వాటిలో ఏం ఉన్నాయనేది బుధవారం తేలుస్తామని అధికారులు తెలిపారు. నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -