అధికారుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలన
నవతెలంగాణ-దుండిగల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఉదయం కార్యాలయ సమయం ప్రారంభం కాకముందే ఏసీబీ బృందం నేరుగా డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ క్యాబిన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అధికారుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని రికార్డులను పరిశీలించారు. మంగళవారం చింతల్ సర్కిల్లో బిల్ కలెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న నేపథ్యంలో దుండిగల్ సర్కిల్లో కూడా వరుస తనిఖీలు కొనసాగుతున్నాయి. దీంతో సంబంధిత విభాగాల్లో ఆందోళన నెలకొంది.
ఉదయం నుంచే విస్తృత తనిఖీలు
ఏసీబీ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు చెందిన కొంతమంది అధికారులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది గైర్హాజరైనట్టు సమాచారం. కొందరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండడం గమనార్హం. రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. డీఎస్పీ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సర్ప్రైజ్ చెకింగ్ చేపట్టామని తెలిపారు. రికార్డుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య, వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బంది మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. అనధికారికంగా పనిచేస్తున్న కొందరిని కూడా గుర్తించామని వెల్లడించారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక ఫోకస్…
మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీకి విలీనం అయిన తర్వాత రికార్డుల నిర్వహణలో గందరగోళం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ, వాటిపై సమయానికి చర్యలు తీసుకోలేదని గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.



