మన సాహిత్యంలో సాహితీవేత్తల సాహిత్యమును పరిశీలిస్తూ వాటి గురించి వ్యాసాలు వెలువరించడమూ , ఆ సాహిత్యంను విశ్లేషణతో కూడిన రచనలు వెలువరించడం చూస్తూనే ఉన్నాం. అలాగే సాహితీవేత్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సాహిత్య కషిని బహిర్గతం చేయడం ఒక పద్ధతి. అరుణ పైన చెప్పిన ప్రక్రియలలో సాధికారతను పొంది మసన చెన్నప్ప గారితో మూఖ అంతర్జాల పత్రిక కోసం ముఖాముఖి నిర్వహించారు. ఇందుకు కొనసాగింపుగా మసన చెన్నప్ప సప్తతికి, ఆయన సాహిత్యం (60 పుస్తకాలు) అంతా ఔపాసన చేసి, వివేచనతో ”మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యము” పేరుతో ఈ గ్రంథాన్ని రచించారు. ఈ పుస్తకంలో చెన్నప్ప గేయ కవిత్వం, పద్య కవిత్వం, శతకాలు, వచన కవిత్వం, సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, అనువాద సాహిత్యం, యం.ఫిల్., పి.హెచ్.డి.(పరిశోధన అంశాలు); వచన గ్రంథాలు, నాటిక, నవల, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, యోగ దర్శనం ఇలా సంపూర్ణ సాహిత్యాన్ని మధించి ఒక సంపూర్ణ గ్రంథాన్ని వెలువరించారు. ఒకవిధంగా ఈ అంశాన్ని తీసుకుని ఏదేని విశ్వవిద్యాలయంలో డాక్టరేటు పట్టాకోసం సమర్పించి ఉంటే, ఆ పట్టా ఆవిడ చేతికి వచ్చి ఉండేది. దీని వలన మనకు తెలిసివచ్చినదేమిటంటే కేవలం ఏ ఆకాంక్ష లేకుండా, నిబద్ధతతో మసన చెన్నప్ప సాహిత్యానుశీలనం చేసారని చెప్పవచ్చును. ధూళిపాళ అరుణ ఎంచుకున్న మార్గం ఇతరులు అనుసరించదగినదిగా ఉంది. ఇపుడెవరైనా చెన్నప్ప సాహిత్యాన్ని ఎంచుకుని పరిశోధన చేస్తే వారికిది ఒలిచిన పండు చేతిలో పెట్టినట్టుగా ఉంటుంది. ఈ పుస్తకంలో అరుణ చెన్నప్పతో చేసిన ముఖాముఖిని కూడా జతపరిచింది. పద్య కవిత్వం, యోగ దర్శనం మరికొన్ని అధ్యాయాలను పరిచయం చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడితే బాగుండేదనిపించినది. ఏదేమైనా అరుణ చెన్నప్పలకు అభినందనలు.
డాక్టర్ టి.శ్రీరంగస్వామి



