Friday, February 20, 2026
E-PAPER
Homeమానవివారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత

వారసత్వ సంపదను కాపాడుకోవడం మన బాధ్యత

- Advertisement -

వసంతశోభ… మన ప్రాచీన భారతీయ కట్టడాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపుతెస్తున్న తరుణి. మన వారసత్వ సంపదను కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. దీని కోసం ఎన్నో పరిశోధనలు చేశారు. తురగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, జర్నలిజం రంగాలకు విశేష సేవలందిస్తున్నారు. కళలను ప్రోత్సహించడంలో, కాపాడడంలో ఆ కాలానికి ఈ కాలానికి వారధిగా ఉన్నారు. ‘మన వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత’ అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో..

వసంతశోభ తల్లి తురగా జానకీరాణి, తండ్రి కృష్ణ మోహన్‌ రావు. తల్లి ఆలన పాలనలో సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. చిన్నతనం నుండే నాటకాలు, రేడియో ప్రోగ్రాంలలో పాల్గొన్నారు. వీరి అమ్మమ్మ ప్రఖ్యాత రచయిత చలం గారి మేనకోడలు. బడిలో చదువుతుండగా టి.వి.లో ఒక సీరియల్‌ చూశాక శోభకి ఆర్కిటెక్ట్‌ కావాలనే కోరిక కలిగింది. తల్లి చేయూతతో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆర్టిటెక్ట్‌ డిగ్రీలో చేశారు. అదే సమయంలో బొమ్మలు గీస్తూ చిత్ర కళలోనూ ప్రావీణ్యం సంపాదించారు. తర్వాత M.Arch(SPA Delhi) AP(ITPI), Phd(JNAFAU) కూడా పూర్తి చేశారు.

అనేక ప్రాజెక్టులు…
వసంత శోభ తన 30 ఏండ్ల అనుభవంలో చేపట్టిన ప్రాజెక్టులు ఎన్నెన్నో! వాటిలో సత్యం ఫౌండేషన్‌, సి.ఎస్‌.ఆర్‌.ఆఫ్‌ సత్యం కంప్యూటర్స్‌, UNDPGOI Endogenous TourismProject చెప్పుకోదగ్గవి. విద్యాసంస్థలతో అనుబంధంతో పాటు న్యూస్‌ పేపర్లకు టెక్నికల్‌ జర్నల్స్‌కి ఆర్టికల్స్‌ రాస్తారు. 2011లో యునెస్కో పారిస్‌, UN Habitat కెన్యా 2011, 2013 ICOMOS బీజింగ్‌(2012) పెన్సిల్వేనియా యూనివర్శిటీ, ISOCARP (2020) వంటి ముఖ్యమైన ప్రాజెక్టులలో ప్రముఖ పాత్రను పోషించారు.

చారిత్రక కట్టడాల సంరక్షణలో…
‘2003లోనే ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకి డిటైల్డ్‌ మ్యాప్స్‌, డయాగ్రమ్స్‌తో రిసెర్చి పేపర్లు పంపాను. కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజానికి వరల్డ్‌ హెరిటేజ్‌ సిటీగా హైద్రాబాద్‌కి ఘనచరిత్ర ఉంది. వేలాది చారిత్రక కట్టడాలున్న ప్రాంతం మన హైదరాబాద్‌. గోల్కొండ కోటపై రీసెర్చి ప్రాజెక్టు చేపట్టాను. మొహరం నెల మొదటిరోజున హైదరాబాద్‌ నగర శంకుస్థాపన జరిగిన శిలాఫలకం ఉంది. అలా జులై 7వ తేదీని హైద్రాబాద్‌ పుట్టిన రోజు జరపాలని నేను చేసిన సూచనకి ఆమోదముద్ర పడింది. హైద్రాబాద్‌ రెసిడెన్సీ కోసం హైకోర్టులో కేసువేసి పరిరక్షిత జాబితాలో చేర్చడంతో నా శ్రమ ఫలించిందని చెప్పొచ్చు. సికింద్రాబాద్‌కి 200 ఏండ్ల ఉత్సవాలు, వరంగల్‌, కాజీపేట, హన్మకొండ వారసత్వ కట్టడాలు, కర్ణాటక ప్రభుత్వం కోసం మాస్టర్‌ ప్లాన్స్‌ వంటివి కొన్ని నేను చేసిన కృషిలో చెప్పుకోదగ్గ విషయాలు. అలాగే నూజివీడు వీణ, కొండపల్లి బొమ్మలు ఇతర హస్తకళలకు ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించాను. హెరిటేజ్‌ క్లబ్‌ ఏర్పాటు చేశాను. వారసత్వ కట్టడాల విశ్లేషణలో నేను వైవిధ్యంగా ఆలోచిస్తాను’ అంటూ ఆమె తన అనుభవాలను వివరించారు.

తురగా సిస్టర్స్‌…
వసంత శోభ చేస్తున్న ఈ కృషిలో తన సోదరి ఉషారమణి కృషి కూడా ఎంతో ఉంది. తురగా సిస్టర్స్‌ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే వీరు తురగా ఫౌండేషన్‌ నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉషారమణి రేడియో న్యూస్‌ రీడర్‌గా తన గళంతో వార్తలు చదవటంలో ఒరవడి సృష్టిస్తూ, యువతకు శిక్షణ ఇస్తున్నారు. వసంత శోభ తన చేతలతో రాష్ట్రానికి, దేశానికి నిశబ్ద సేవ చేస్తున్నారు. ఇలా అక్కచెల్లెళ్లు ఇద్దరూ తమ మాటలు, చేతలతో అటు తురగా వంశానికి, ఇటు తెలుగు వారికి స్ఫూర్తిదాతలుగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. 2017లో తెలంగాణ హెరిటేజ్‌ యాక్ట్‌ రావడంపై శోభ హర్షం వ్యక్తం చేశారు.

ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో…
తురగా ఫౌండేషన్‌ గురించి చెప్పుకోవాలి. ఈ ఫౌండేషన్‌కి ట్రస్టీలుగా ఈ అక్క చెల్లెళ్లతో పాటు పి.వి.రమణకుమార్‌ (ఛార్టెడ్‌ ఎకౌంటెంట్‌), శైలజ పిల్లలమర్రి, రాధికా రమేష్‌, కల్పనా రాఘవేంద్ర, రేవతీ తురగా ఉన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేని రిజిష్టర్‌ చేయబడిన ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, జర్నలిజం వంటి మొదలైన రంగాల్లో తనవంతు కృషి చేస్తున్నారు. తురగా జానకీరాణి పేరుమీద కథల పోటీలు, అత్తయ్య సత్యవతి పేరుమీద టీచర్లకు, శ్రీ నరేంద్ర రేవెళ్లి పేరుమీద జర్నలిజం రంగంలో ఉన్న వారికి అవార్డులిస్తున్నారు. అలాగే పుస్తకాలు ముద్రిస్తున్నారు.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -