Tuesday, June 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘ఆశలు’’ ఆహుతి

‘‘ఆశలు’’ ఆహుతి

- Advertisement -

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కోచింగ్ సెంటర్‌‌లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదం పద్నాలుగు మంది విద్యార్థుల్ని బలిగొంది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనే ఆశతో కోచింగ్‌కు వెళ్లిన వారు సజీవ దహనమవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మంటలు, పొగల మధ్య చిక్కుకున్న విద్యార్థులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకు నేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేశాయి. ఈ ఘటన ఒక సాధారణ ప్రమాదం అనడం కంటే నిర్లక్ష్యానికి, పరిపాలనా వైఫల్యానికి, ఉపాధి సంక్షోభానికి సజీవ సాక్ష్యంగా చెప్పొచ్చు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి, ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేస్తూ, పరిహారం కూడా ప్రకటించారు. కానీ, పోయిన ప్రాణాలను తీసుకు రాగలరా?

భవనంలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిపడా లేవన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు అవసరమైన మార్గాలు లేకపోవడం, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించడం కారణంగా తెలుస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. భవన యాజమాన్యం, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, పర్యవేక్షణ బాధ్యత వహించే ప్రభుత్వం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ఉంటే ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగేది కాదు. మంటలు వ్యాపించినప్పుడు విద్యార్థులు కిటికీలను ఆశ్రయించడం, పై నుంచి దూకడం చూస్తుంటే తప్పించుకోవడానికి సరైన దారి కూడా కనిపించడం లేదని అర్థమవుతోంది. ఇది ముమ్మాటికీ పాలనావ్యవస్థ పర్యవేక్ష‍ణ లోపమే అవుతుంది.

అలాగే ఈ విషాదాన్ని అర్థం చేసుకోవాలంటే యూపీలోని యువత పరిస్థితిని కూడా పరిశీలించాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువకులు ఏండ్ల తరబడి సిద్ధమవుతున్నారు. నియామకాలలో జాప్యాలు, పరీక్షల రద్దులు, ప్రశ్నా పత్రాల లీకేజీలు, ఖాళీల భర్తీలో ఆలస్యం వంటి సమస్యలు యువతను కోచింగ్ సెంటర్లపై మరింతగా ఆధారపడేలా చేస్తున్నాయి. ఉద్యోగం దొరకాలంటే కోచింగ్ తప్పనిసరి అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కోచింగ్ పరిశ్రమ భారీ వ్యాపారంగా మారింది. బీజేపీ పాలకులు ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి నమూనాగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటాన్ని ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’’గా పేర్కొంటున్నారు. కానీ ఈ ఘటన ఆ ప్రచారానికి భిన్నమైన వాస్తవాలను బయటపెడుతోంది. ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉంటే, ప్రభుత్వ నియామకాలు క్రమబద్ధంగా జరిగితే, యువత లక్షల సంఖ్యలో కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంటుంది? ఉద్యో గాల కొరతే కోచింగ్ కేంద్రాలను ప్రత్యామ్నా యంగా మార్చింది.
లక్నో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి విద్యార్థి వెనుక ఒక్కో కుటుంబ శ్రమ దాగి ఉంది. వాళ్లు వ్యవసాయంపై ఆధారపడిన వారు కాచవ్చు, లేదంటే చిన్న వ్యాపారం చేసుకుని జీవనాధారం పొందేవారు కావచ్చు, అప్పులు చేసి చదువుకునే వారు కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఇంటికి పెద్దదిక్కుగా మారతారని భావించిన తల్లిదండ్రులకు పిల్లలు అగ్నికి ఆహుతి కావడం వారిని శాశ్వత విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదం యాజమాన్య నిర్లక్ష్యానిది మాత్రమే కాదు, ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యాన్ని కూడా ప్రశ్నిస్తోంది. భవనానికి అనుమతులు ఎవరిచ్చారు? అగ్నిమాపక శాఖ తనిఖీలు ఎప్పుడు నిర్వహించింది? భద్రతా లోపాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? విద్యార్థులతో నిండిపోయే కోచింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పా ల్సింది ప్రభుత్వమే. ‘విచారణ జరుగుతోంది’ అన్న మాటలు చెప్పి తప్పించుకుంటామంటే కుదరదు.

ఎందుకంటే, దేశంలో ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు, ఆస్పత్రులు, వాణిజ్య సము దాయాలు, కోచింగ్ కేంద్రాలు అగ్నికి ఆహుతవుతున్నా పర్యవేక్ష‍ణ లేదు. ఘటన జరిగినప్పుడు మాత్రం సానుభూతి, పరిహార ప్రకటనలు షరా ‘మామూలే’! కానీ కొంత కాలానికే అన్నీ మరిచిపోతారు. బాధిత కుటుం బాలు మాత్రం జీవితాంతం ఆ నష్టాన్ని మోస్తూనే ఉంటాయి. అందుకే లక్నో ఘటనను కూడా కేవలం ఒకరోజు వార్తగా పరిమితం చేయకూడదు. ఈ విషాదం మూడు ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటిది భద్రతా ప్రమాణాల అమలు. రెండోది ప్రభుత్వ పర్యవేక్షణ సామర్థ్యం. మూడోది యువతను కోచింగ్ కేంద్రాలపై ఆధారపడేలా చేస్తున్న నిరుద్యోగ సమస్య. ఈ మూడు అంశాలను పరిష్కరించకుండా ఇటువంటి ప్రమాదాలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు.
లక్నోలో ప్రాణాలు కోల్పోయివారు తిరిగి రారు. కానీ వారి మరణాలు ఒక ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా నిలవాలి. ఉద్యోగం కోసం, భవిష్యత్తు కోసం కోచింగ్ కేంద్రాలకు వెళ్లిన యువజీవితాలు అగ్నికీలల్లో బూడిద కావడం విషాదం. ఈ ఘటనతో ఇది ముగిసిపోలేదు. దేశంలో అభివృద్ధి, ఉపాధి, భద్రతల మాటున జరుగుతున్న అసౌకర్యాలను, మోసాలను, ప్రశ్నలను నిరంతరం లేవనెత్తుతూనే ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -