Tuesday, June 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైల్వేమంత్రితో సీఎం భేటీ

రైల్వేమంత్రితో సీఎం భేటీ

- Advertisement -

​అపాయింట్‌‌మెంట్‌ ఇప్పించిన కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి
ఐఆర్‌ఎఫ్‌‌సీ రుణం ఇప్పించాలని విజ్ఞప్తి
పెండింగ్‌ ‌సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రులతో
వరుస భేటీలు…ఢిల్లీలో సీఎం బిజీ బిజీ
నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డే అడ్డు అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి, ఢిల్లీలో ఆయనతో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశినీ వైష్ణవ్‌‌తో భేటీ అయ్యారు. మెట్రోరైల్‌ ‌ఫేజ్‌-2కు సంబంధించి ఇండియన్‌ ‌రైల్వే ఫైనాన్స్‌ ‌కార్పొరేషన్‌ ‌(ఐఆర్‌ఎఫ్‌‌సీ) రుణాన్ని కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డే అడ్డుకుంటున్నారని సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఫైర్‌ అయిన సీఎం సోమవారం అదే కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డితో కలిసి అదే ఐఆర్‌ఎఫ్‌‌సీ రుణాన్ని త్వరగా మంజూరు చేయాలని రైల్వేమంత్రిని కోరారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్‌-2 అనుమతులపై చర్చించారు. రాష్ర్టంలో పెండింగ్‌‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. రైల్వేమంత్రితో అపాయింట్‌‌మెంట్‌‌ను కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డే ఇప్పించారని సమాచారం. ఇటీవలి కాలంలో సీఎం కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధి పేరుతో బీజేపీపై సీఎం చేస్తున్న విమర్శలు, రాష్ర్టంలో ఆపార్టీకి రెండోస్థానం కల్పించడం కోసమేననే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్న సమయంలో ఢిల్లీలో కిషన్‌‌రెడ్డి, సీఎం కలిసి రైల్వే మంత్రిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ఈ సమావేశానికి ప్రాథాన్యత ఏర్పడింది.
థ్యాంక్స్‌…రక్ష‍ణ మంత్రికి సీఎం కృతజ్ఞతలు
హైదరాబాద్‌‌లోని కంటోన్మెంట్‌ ‌భూముల్ని రాష్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ రక్ష‍ణ శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌‌రెడ్డి కేంద్ర రక్ష‍ణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్‌‌సింగ్‌‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ర‌క్షణ శాఖ కార్యాల‌యం క‌ర్తవ్య భ‌వ‌న్‌లో ఆయన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించ‌నున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయాల‌ని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే దేవరకద్రలో డీఆర్ డీవో ప్రాజెక్ట్ తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌ అంశాలపై చర్చించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ స్పెష‌ల్ సెక్రెటరీ వికాస్‌రాజ్‌, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ కే.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్‌, స్పెష‌ల్ సెక్రట‌రీ కో–ఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ లో భాగమైన ‘గాంధీ స‌రోవ‌ర్’ ప్రాజెక్టుకు ర‌క్షణ శాఖ భూములు బ‌ద‌లాయించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కృత‌జ్ఞతలు తెలిపారు. భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్రయాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో (ఎంఆర్వో), హ్యాంగ‌ర్ సౌక‌ర్యాల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఇటీవ‌ల మ‌ధ్య ఆసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి స‌రైన ప్రదేశాల‌ను అన్వేషిస్తున్నాయ‌న్నాయని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ఈ విషయంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూల‌మైందన్నారు. ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం కోరారు. అలాగే… త‌మ కీల‌కమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్ట్‌ను త్వర‌గా మంజూరు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -