కార్మిక సమస్యలను పరిష్కరించండి
సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండున్నరేండ్లు దాటినా కార్మికులకిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిదని విమర్శించారు. కార్మిక సమస్యలను గాలికొదిలి, ప్రచార ఆర్భాటాలకు పోతున్నదని తెలిపారు. కొత్తగా సామ్రాజ్యవాద పల్లకిని తలకెత్తుకున్నదని పేర్కొన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పరిసర ప్రాంతాల రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టడానికి నిర్ణయించారని తెలిపారు. అలాంటి భక్తిని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు వేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కాం పేరుతో కొత్త డిస్కాం ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి చేసిందని తెలిపారు. సమ్మె ముగిసి 50 రోజులు దాటినా ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ. 56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలనీ, సంస్థను పరిరక్షించి కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలని కోరారు. ఫ్రీ ప్రైమరీ, పిఎంశ్రీ విద్యను అంగన్వాడీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 18వేలు కనీస వేతనం పెంచి ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని కోరారు. అశా వర్కర్లకు కనీస వేతనం రూ. 18వేలకు పెంచి, రూ॥ 50 లక్షల బీమా, రూ.50వేలు మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్ లు తదితర సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకెపి వివోఏలకి ప్రభుత్వం వేతనాలు పెంచి. సిబ్బంది వ్యక్తిగత అకౌంట్లు ప్రారంభించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రూ॥ 10వేల ఎన్నికల హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ పంచాయతీ, భవన నిర్మాణం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్‌పై భక్తిని మానుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



