కూలిన చెట్లు.. స్తంభించిన ట్రాఫిక్
నవతెలంగాణ-ఏన్కూర్
ఖమ్మం జిల్లాలో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పాటు కురిసిన వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయగా, పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ఉన్న గుంతలన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో అవి చెరువులను తలపించాయి. దాంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా, పలుచోట్ల చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఏన్కూర్బీ-ఎన్ తండా మధ్య ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి మండల వ్యాప్తంగా నష్టం వాటిల్లింది. స్థానిక రైతు మేడ ధర్మారావుకు చెందిన పామాయిల్ తోటలోని రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోగా, పలు పామాయిల్ చెట్లు నేలకొరిగాయి. దీంతో రైతుకు గణనీయమైన నష్టం సంభవించింది. అలాగే మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రహదారిపై పడిన చెట్లను తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించడంతో పాటు విద్యుత్ సరఫరాను కూడా క్రమబద్ధీకరించారు.
ఉరుములు, మెరుపులతో.. ముంచెత్తిన భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



