కాలాలు మారినప్పుడల్లా చరిత్ర మారుతుందని తెలుసూ
రాజులు మహరాజులు రాజ్యాలు ప్రజలు వేషాలు
అన్నీ మారడం మనం చూస్తునే వున్నాం
మరి గ్రహణం పట్టిన మా బతుకెందుకో ఇలానే వుండాలని
శాసించిన మూర్ఖులెవరు?
కులాల అంతరాలను దాటుకుని
స్వేచ్ఛ కుసుమాలమై వికసించాలని వుంది
అయినా ఎక్కడో ఓ చోట.. సర్పాలు బుసకొడుతున్నాయి
ఎవరో ఒకరు రాకపోతారా అని ఎదురు చూస్తే
మనం చదివే పుస్తకాలలో తెల్లకాగితాలే మిగిలేవి
నిన్నటి చీకటి రేపటి వెలుగుకు మధ్య
ఓ కాంతి పుంజం పురుడు పోసుకుంటుందన్న నిజం
ఎరుగక పోతే ఎలా?
బ్రహ్మ రాసిన రాతను సైతం ధిక్కరించి
పోరాడే శక్తి మన పిడికిలికి వుంది
అమాయకులు ఉన్న చోట అణిచివేయబడిన చోట
ధిక్కారమై ప్రజ్వరిల్లుతేనే
తాడో పేడో తెలుస్తుందన్నది నిజమే కదా
తరగతి గది అక్షరాలనిస్తే వెన్నుపోటు పొడిచే మనుషుల మర్మం
బతుకు ప్రయోగశాలలో నేర్చుకుంటామని తెలుసుకో
రాజీ పడితే అది జీవితమే కాదని
మన ఒక్క అడుగు రేపటి భవితకు మార్గం చూపే దారులు వేస్తుంది
అసలే ఇది మానవలోకం
ఇక్కడ మనిషి తోలుకప్పుకున్న మగాలు
నీడను కూడా మింగాలని చూస్తాయి జాగ్రత్తా
ఇక్కడ సత్యం అంటే గోడ మీద అక్షరాలు మాత్రమే అని తెలుసుకో..
ప్రశ్నించే తత్వం ప్రతిమనిషి హక్కు అయితే
నీ జీవన పయనంలో మార్పు సహజం అవుతుంది
వజ్జీరు ప్రదీప్, 9989562991
జీవన మర్మం
- Advertisement -
- Advertisement -



