నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రమాదంలో శిరస్త్రాణం ( హెల్మెట్) వాహనదారులకు శిరోధార్యం అని ఎస్ఐ అఖిల అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎర్రైవ్ ఎలైవ్ ఫేస్ – 2 కార్యక్రమాన్ని సోమవారం అశ్వారావుపేట పోలీస్ లు నిర్వహించారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించుట యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
రోడ్డు ప్రమాదాలలో తల గాయాలే అధిక శాతం మరణాలకు కారణమవుతున్న నేపథ్యంలో, రైడర్ తో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నాలుగు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ వినియోగించడం చట్టపరంగా, ప్రాణ రక్షణ పరంగా అత్యవసరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై అఖిల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.



