ఎస్ఐఆర్ ప్రక్రియపై భయాందోళనలు.. ప్రతిపక్షాల అభ్యంతరాలు.
నవతెలంగాణ- సిర్పూర్ (టి )
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఈ ప్రక్రియ లక్ష్యం ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమేనని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, దీనివల్ల అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే అవకాశం ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాల ఓటర్లపై దీని ప్రభావం పడే అవకాశముందని ఆరోపిస్తున్నాయి.
తెలంగాణలో ఈ నెల 25వ తేదీ నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక ఫారాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ ఫారాలను ఎలా నింపాలి? ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి? ఏ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి? అనే అంశాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో తమ ఓటు హక్కు కోల్పోతామేమోనన్న ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది.
ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆరోపణల ప్రకారం, ఇలాంటి ప్రక్రియ అమలు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని వారు పేర్కొంటున్నారు. అదే పరిస్థితి తెలంగాణలోనూ తలెత్తకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అధికారులు ఇచ్చే ఫారాలను పూర్తిగా నింపాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించి, ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాయి. ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎప్పటికప్పుడు జాబితాలను పరిశీలించాలని తమ కార్యకర్తలకు సూచిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ నమోదులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మారిన వారి వివరాల సవరణ వంటి ప్రయోజనాలు ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే మరోవైపు ప్రజల్లో సరైన అవగాహన కల్పించకుండా ప్రక్రియను అమలు చేయడం వల్ల అయోమయం పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పేదలు, వృద్ధులు, వలస కార్మికులు, నిరక్షరాస్యులు అవసరమైన పత్రాలు సమర్పించలేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి అత్యంత విలువైన హక్కు. అందువల్ల అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. అదే సమయంలో ప్రజలు కూడా అధికారులు అందజేసే ఫారాలను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా నింపి, తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచిస్తున్నారు.



