Saturday, June 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅడుగంటుతున్న సింగూరు

అడుగంటుతున్న సింగూరు

- Advertisement -

ఓ వైపు ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో వైపు పూడిక
పూర్తికాని ప్రాజెక్టు మరమ్మతు పనులు
తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు
రెండేండ్లుగా క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు


నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

తాగు, సాగునీరు అవసరాలు తీర్చే కల్పతరువయిన సింగూరు ప్రాజెక్టు.. ఇప్పుడు బోసి పోవడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల తాగునీటి అవసరాలను తీర్చే కీలక జలవనరు సింగూరు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో భవిష్యత్ తాగు, సాగు నీటి సరఫరాపై ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తికాలేదు. మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఎల్‌నినో ప్రభావం నీటి లభ్యతపై భయాందోళన నెలకొంది. భవిష్యత్తులో సమస్యలు ఎదురుకాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రాజెక్టు మరమ్మతు పనులు వేగవంతం చేశారు.

వేల ఎకరాలకు సింగూరు నీరే దిక్కు..
సింగూరు నుంచి 40వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన ఘనపురం ఆనకట్టకు సైతం ఇక్కడి నుండే 25వేల ఎకరాలకు నీటిని విడుదల చేస్తారు. అంతే కాకుండా ప్రస్తుతం జంటనగరాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ఈ ప్రాజెక్టు ఆధారంగా మిషన్ భగీరథ పథకాలను ఏర్పాటు చేశారు. సింగూరు కట్టంతా మట్టితో నిర్మించారు. ప్రాజెక్టు రివిట్‌మెంట్‌ను బండరాళ్లతో ఏర్పాటు చేశారు. సింగూరు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి 24 సంవత్సరాల పాటు రివిట్‌మెంట్ కట్ట పటిష్టంగానే ఉన్నది. కానీ ఇప్పుడే అసలు సమస్య మొదలైంది.

మెయింటెనెన్స్ లేకపోవడంతో 
దెబ్బతిన్న రివిట్‌మెంట్..
సరైన మెయింటెన్స్ లేకపోవడం, మరమ్మతుల పనులు చేయకపోవడంతో రివిట్‌మెంట్ దెబ్బతినడం మొదలైంది. 2012వ సంవత్సరంలో రాళ్లు తొలగిపోవడం, కట్ట కుంగిపోవడంతోపాటు రివిట్‌మెంట్ కుంగిపోవడం పెరిగింది. ఆ తర్వాత పైపైన పనులు చేశారు. సిమెంట్ పూత పూసి మెరుగులద్దారు. కట్టకింద పనులు చేయకపోవడంతో సిమెంట్ కొట్టుకుపోయి అనుకున్న దానికంటే వేగంగా కుంగిపోయి, రాళ్లన్నీ పోయాయి. అలల తాకిడి నేరుగా కట్టపైనే పడింది. ఈ దశలో రివిట్‌మెంట్ కుప్పకూలింది. దాంతో అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టారు. ఇసుక, కంకర చిప్స్ సంచుల్లో నింపి రివిట్‌మెంట్‌లను అమర్చారు. అలల దాటికి అవి నిలవలేదు. ఒకవైపు అలల తీవ్రత, మరో వైపు కుంగిపోవడంతో మొత్తం ఓ లైన్ గీసినట్టే ఇసుక, కంకర కుంగిపోయాయి. దాంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. 2025 జూన్ 23న డ్యాం సేప్టీ రివ్యూ చైర్మెన్ అశోక్ కుమార్ గుంజు, అధికారులు యోగిందర్ కుమార్, పి.రామరాజు, ఎం.రాజు, కన్నయ్యతో కూడిన బృందం పరిశీలించింది. ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. సింగూరు కట్టకు ఏ క్షణమైనా గండిపడొచ్చని, కట్ట కొట్టుకుపోవచ్చనేది రిపోర్టులో ఉంది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయాలని సూచించింది.

తక్షణ మరమ్మతులకు 
రూ.16.08 కోట్లు విడుదల..
డ్యాం సేప్టీ రివ్యూ కమిటీ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ మరమ్మతులకు రూ.16.08 కోట్లు, శాశ్వత పునరుద్దరణ పనులకు రూ.61.50 కోట్లు మంజూరు చేసింది. పనులు సైతం మొదలయ్యాయి. వచ్చే వానాకాలం నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో ఐదు టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. డ్యాం పూర్తి స్థాయిలో రిపేరు చేయాలంటే సింగూరు మొత్తం ఖాళీ చేయాలి. కానీ వర్షాకాలం రావడం, మరో వైపు ఎలినోతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు, వర్షాకాలంలో డ్యాంలోకి ఎగువ నుంచి వచ్చే నీటిని వచ్చినట్టే దిగువకు వదలాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాలం వరకు నీరు నిలువ ఉండదు. దాంతో తాగు, సాగునీటికి ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ప్రశ్న.

​మరమ్మతుల వల్ల తాగునీరు ఆగిపోతుంది : ఇరిగేషన్ ఈఈ భీమ్
సింగూరు ప్రాజెక్టు పనుల వల్ల తాగునీరు, ఆయకట్టుకు నీరు ఆగిపోతుంది. హైదరాబాద్, సంగారెడ్డి పట్టణంతోపాటు సాగుకోసం ఇచ్చే 40వేల ఎకరాలకు నీరు ఆగిపోతుంది. మళ్లీ ఒక 40వేల ఎకరాలకు లిఫ్ట్ ప్రపోజ్ చేస్తున్నారు. అందువల్ల ఇది డ్యామేజీ కాకుండా కాపాడాలని ఇంజనీర్లందరూ పని చేస్తున్నారు. బండ్ సెక్షన్ సీడీఓ నుంచి తీసుకుని రివిట్‌మెంట్ ప్రొటక్షన్ చేస్తే 100 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా ఉండదు. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాజెక్టు మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.

​సింగూరు మరమ్మతు పనులు పూర్తి చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి.జయరాజు
సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు ఎండాకాలంలో పూర్తి చేయాల్సింది.. అనుకున్న టైంలో పూర్తి చేయకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి సమస్య తలెత్తుతోంది. సంగారెడ్డి, హైదరాబాద్‌కు కూడా తాగునీటికి చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. 40వేల ఎకరాలకు సాగునీరు గతేడాది ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ప్రధానంగా క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి వస్తుంది. దీనికి అధికారులదే ప్రధాన బాధ్యత. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్ల నాసిరకం పనులు చేస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -