Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంఅదానీకి అండగా మాజీ సీజేఐ?

అదానీకి అండగా మాజీ సీజేఐ?

- Advertisement -

అమెరికా కేసు కొట్టివేతకు 500 పేజీల వ్యూహం!
అమెరికా న్యాయశాఖకు మాజీ ప్రధాన న్యాయమూర్తి
సహా నిపుణుల అభిప్రాయాలు
కోర్టులో సమర్పించిన అదానీ లాయర్లు
118 పేజీల మెమో, పలు ఆధారాలతో
కేసు బలహీనమని వాదనలు
ఆ మాజీ సీజేఐ ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ
తమకేం సంబంధం లేదని ఖండించిన
ఏడుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు

న్యూఢిల్లీ : అమెరికాలో లంచాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి న్యాయపరంగా ఉపశమనం లభించేలా భారత్‌ ‌నుంచి పెద్ద ఎత్తునే సహాయ, సహకారాలు అందాయి. ఆయనపై క్రిమినల్‌ కేసును కొట్టివేయించాలన్న అమెరికా న్యాయశాఖ (డీఓజీ) నిర్ణయానికి ముందు.. భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సహా పలువురు ప్రముఖ నిపుణుల అభిప్రాయాలను అదానీ తరఫు న్యాయవాదులు అమెరికా అధికారులకు సమర్పించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సీఈఓ వినీత్‌ జైన్‌ తరఫు న్యాయవాదులు అమెరికాలోని ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జిల్లా కోర్టులో న్యాయమూర్తి నికోలస్‌ గరాఫిస్‌కు సమర్పించిన 15 పేజీల పిటిషన్‌లో వెల్లడించారు. క్రిమినల్‌ అభియోగాలను శాశ్వతంగా కొట్టివేయాలన్న అమెరికా న్యాయశాఖ అభ్యర్థనను కోర్టు ఆమోదించాలని, అలాగే అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)తో కుదిరిన సివిల్‌ కేసు రాజీని కూడా ఆమోదించాలని ఇందులో కోరారు.

నెలల తరబడి సాగిన లాబీయింగ్‌
ఈ పిటిషన్‌లో మరో కీలక విషయం బయటపడింది. అదానీపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని అమెరికా న్యాయశాఖను ఒప్పించేందుకు ఆయన ‌తరఫు న్యాయవాదులు నెలల తరబడి విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేశారు. 2026 జనవరిలో గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలకు భారత్‌లో 14 నెలలుగా సమన్లు అందజేయలేకపోయామని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపిన కొద్ది వారాలకే ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి- ఏప్రిల్‌ మధ్య అమెరికా న్యాయశాఖకు 118 పేజీల చట్టపరమైన మెమొరాండం, తొమ్మిది పేజీల కవర్‌ లెటర్‌, అనంతరం పలు అదనపు నివేదికలు, ప్రజెంటేషన్లు న్యాయవాదులు సమర్పించారు. మొత్తంగా వాస్తవాలు, చట్టపరమైన వాదనలు, నిపుణుల అభిప్రాయాలు, ఇతర పత్రాలతో కలిపి దాదాపు 500 పేజీల సమాచారాన్ని అందించినట్టు పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.

మాజీ సీజేఐ సహా ప్రముఖుల నివేదికలు
ఈ పత్రాల్లో సుమారు 200 పేజీలలో ప్రముఖ నిపుణుల అభిప్రాయాలే ఉన్నాయి. వీటిని హార్వర్డ్‌ లా స్కూల్‌కు చెందిన సెక్యూరిటీస్‌ చట్ట నిపుణుడు, అమెరికా ఎస్‌ఈసీ మాజీ కమిషనర్‌, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, భారత కేంద్ర విద్యుత్‌ అథారిటీ మాజీ చైర్మెన్‌, అలాగే కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ మాజీ సభ్యుడు సిద్ధం చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఆ నిపుణుల పేర్లను మాత్రం పిటిషన్‌లో వెల్లడించలేదు.

ఎవరు ఆ మాజీ సీజేఐ?
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మాజీ సీజేఐ ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు 20 మందిని ఓ వార్త సంస్థ సంప్రదించింది. అయితే ఇప్పటివరకు స్పందించిన ఏడుగురు మాజీ సీజేఐలు మాత్రం ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. వీరిలో సంజీవ్‌ ‌ఖన్నా, ఆర్‌.ఎం. లోధా, జి.బి పట్టనాయక్‌, ఎన్‌.వి. రమణ, టి.ఎస్‌.ఠాకూర్‌, పి.సదాశివంలు ఉన్నారు.

న్యాయశాఖను ఎలా ఒప్పించారు?
అమెరికా న్యాయశాఖ అధికారులతో నెలల తరబడి సమావేశాలు, చర్చలు జరిగాయి. తాము సమర్పించిన ఆధారాలు ప్రభుత్వ అభియోగాల్లో ‘నాలుగు ప్రధాన లోపాలు’ ఉన్నాయని నిరూపించాయని, అందుకే కేసును కొనసాగించకూడదని న్యాయశాఖ నిర్ణయించిందని అదానీ తరఫు న్యాయవాదులు వాదించారు. కేంద్ర విద్యుత్‌ అథారిటీ మాజీ చైర్మెన్‌ సిద్ధం చేసిన నివేదికలో ఒక ముఖ్యమైన అంశాన్ని పిటిషన్‌ ప్రస్తావించింది. అమెరికా అభియోగాల ప్రకారం.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే నిపుణుల నివేదిక ప్రకారం.. అదే సమయంలో అదానీ గ్రీన్‌, అజూర్‌ పవర్‌ సంస్థలు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు పారదర్శకంగా, చట్టబద్ధంగా ధరలను తగ్గించి రాయితీలు ఇవ్వడం ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అవి సాధారణ వాణిజ్య రాయితీలేనని, లంచాలతో సంబంధం లేదని ఆ నివేదికలో వివరించినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అజూర్‌ పవర్‌పైనే ఎదురుదాడి
అదానీ తరఫు న్యాయవాదులు అజూర్‌ పవర్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తమ అభియోగాలకు ఆధారంగా తీసుకున్న ప్రధాన సాక్ష్యాలన్నీ అదానీకి పోటీ సంస్థ అయిన అజూర్‌ పవర్‌ నుంచే వచ్చాయని తెలిపారు. ఆ సంస్థకు గతంలో అవకతవకల చరిత్ర ఉందని, వారి విశ్వసనీయత కూడా సందేహాస్పదమని వాదించారు. అయితే అమెరికా న్యాయశాఖ మొదట దాఖలు చేసిన అభియోగాల్లో అజూర్‌ పవర్‌ మాజీ అధికారులు కూడా లంచాల కుట్రలో భాగస్వాములేనని పేర్కొంది.

ట్రంప్‌ బృందం పాత్రపై కథనాలు
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. అదానీ తన పాత అమెరికా న్యాయవాదులను మార్చి, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌‌నకు కూడా న్యాయవాదిగా వ్యవహరిస్తున్న సల్లివన్‌ అండ్‌ క్రోమ్‌వెల్‌ సంస్థ కో-చైర్మెన్‌ రాబర్ట్‌ జియుఫ్రాను నియమించిన తర్వాతే కేసు ఉపసంహరణ నిర్ణయం వెలువడింది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. ట్రంప్‌‌నకు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత న్యాయవాది బోరిస్‌ ఎప్‌‌ష్టీన్‌ కూడా తెరవెనుక అదానీ కేసులో పాత్ర పోషించినట్టు వివరించింది. అయితే ఎప్‌‌ష్టీన్‌, అదానీ గ్రూప్‌, అమెరికా న్యాయశాఖ ఈ కథనాన్ని ఖండించాయి. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో గౌతమ్‌ అదానీ అహ్మదాబాద్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో రహస్యంగా సమావేశమైనట్టు బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది.

ఎస్‌ఈసీతో రాజీ
మే 14న గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ కలిసి 18 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఎస్‌ఈసీ సివిల్‌ కేసును ఆరోపణలను అంగీకరిం చకుండా, ఖండించకుండా రాజీ చేసుకున్నారు. ఇటు మే 18న అమెరికా న్యాయశాఖ క్రిమినల్‌ కేసును ఉపసంహరిం చుకోవాలని కోర్టును అధికారికంగా కోరింది. మొత్తంగా అమెరికాలో అదానీపై నమోదైన కేసు ఉపసంహరణ వెనుక భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు ప్రముఖుల న్యాయ, విధానపరమైన అభిప్రాయాలు ఉపయోగించారన్న విషయం వెలుగులోకి రావడం కొత్త చర్చకు దారితీసింది. దీంతో ఆ మాజీ సీజేఐ ఎవరన్నది ఇప్పుడు భారత రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -